గడిచిన ఐదేళ్లల్లో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దోచుకున్న సొమ్ములను మొత్తం బయటకు తీస్తామని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ హెచ్చరించారు. గడిచిన ఐదేళ్లల్లో అవినీతికి కేరాఫ్ అడ్రస్ , నియంతృత్వ పాలన, ఫ్యాక్షనిజానికి కేరాఫ్ అడ్రస్ జగన్ పాలన అని విమర్శించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో యామినీ శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్, వైసీపీ పార్టీపై సంచలన విమర్శలు చేశారు.
జగన్ పాలనలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. పేదల ఇళ్ల కోసం కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించేశారని మండిపడ్డారు. పబ్లిసిటీ పిచ్చి పీక్‌లో ఉన్న జగన్ కేంద్రం ఇచ్చిన పథకాలకు తన స్టిక్కర్ వేయించుకున్నారని ధ్వజమెత్తారు.భూమి హక్కు దారులను కూడా కాదని తన సొంత భూముల్లాగా పట్టాదారుపాస్ పుస్తకాలపై జగన్ తన ఫొటో వేయించుకున్నారని మండిపడ్డారు. దేశం మొత్తం అమలవుతున్న కేంద్రం పథకానికి కూడా తన పేరు, స్టిక్కర్ మార్చుకున్నారని విమర్శించారు. జగన్ అబద్దాలు తెలుసుకున్న కేంద్రం నాలుగు వేల కోట్లు రూపాయలు నిలిపేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల బతుకుపై దెబ్బ కొట్టిన వ్యక్తి జగన్ అని ఫైర్ అయ్యారు. గత ఐదేళ్లల్లో జరిగిన అక్రమాలు, అవినీతి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. ఇసుక, మద్యం ద్వారా వేల కోట్లు దోచేశారని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెరవేర్చారని అన్నారు. మహిళలు, యువత, రైతులు, శ్రామికులు అన్ని రంగాల్లో అబివృద్ధి చెందాలనేది మోదీ లక్ష్యమని తెలిపారు. 2017లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4కోట్ల ఇళ్లు నిర్మించారని గుర్తుచేశారు. ఇందులో మూడు కోట్ల మంది మహిళలను ఇంటి యజమానురాలుగా మోదీ మార్చారని అన్నారు. మహిళా సాధికారితను ఆచరించి చూపిన నేత మోదీ అని ప్రశంసించారు. ఈ ఇళ్లల్లో 65శాతం ఎస్సీ, ఎస్టీలకు 5శాతం వికలాంగులకు కేటాయించారని యామినీ శర్మ అన్నారు.