ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సమ్మె సైరన్ మోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో విలీనానంతర అపరిష్కృత సమస్యలు, విలీనానికి ముందు లిఖితపూర్వక ఒప్పందాలను అమలు చేయకపోవటం, ప్రస్తుత సమస్యలపై ఉద్యమం చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. విజయవాడ వేదికగా రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి అడుగులు వేస్తున్నాయి. ఐక్యంగా కాకపోయినా వేర్వేరుగా అన్ని సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశాలనంతరం ప్రాథమిక ఆందోళనా కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. గుర్తింపు సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్‌ఎంయూఏ)తో పాటు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ఉద్యమ శంఖారావం మోగించే దిశగా కదిలాయి.
తొలుత తమ డిమాండ్లను ఉన్నతాధికారుల ముందుంచాయి. ఇవన్నీ పరిష్కారానికి నోచుకోకపోవటంతో ఆందోళనల వైపు అడుగులు వేస్తున్నాయి.ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్లు రెండు కేటగిరీల్లో ఉన్నాయి. ఉద్యోగుల సమస్యలతో పాటు సంస్థను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ఈ డిమాండ్లలో ఉంచారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2017 పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, విలీనానంతరం ఇచ్చిన తొలి పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, కొత్త నిరుపయోగ ఈహెచ్‌ఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత అపరిమిత వైద్యసేవల విధానాన్ని కొనసాగించాలని, రద్దు చేసిన ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్‌బీటీలను అమలు చేయాలన్నవే ప్రధాన డిమాండ్లు. ప్రస్తుతం నిలిపివేసిన నైట్ అవుట్, డే అవుట్ అలవెన్సులు, ఇన్సెంటివ్‌లు, టీఏ బిల్లులు, ఇతర అలవెన్సులను, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలను చెల్లించాలని కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే డ్రైవర్లు, కండక్టర్లకు విధిస్తున్న జరిమానాలకు సంబంధించి 2019 సర్క్యులర్‌ను తిరిగి అమలు చేయటం కానీ, జీవో నెంబర్ 70, 71ను సవరించాలని కానీ డిమాండ్ చేస్తున్నారు. సంస్థాగతంగా ఖాళీ స్థానాల్లో సిబ్బందిని భర్తీ చేయాలని, స్ర్కాప్‌కు వెళ్లే బస్సులను నిలుపుదల చేయాలని, డిమాండ్‌కు అనుగుణంగా 5 వేల కొత్త బస్సులు కొనాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లకు సంబంధించి ఈయూ నేతలు పి.దామోదరరావు, జీవీ నర్సయ్య, ఎన్‌ఎంయూఏ నేతలు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు, ఎస్‌డబ్ల్యూఎఫ్ నేతలు సీహెచ్ సుందరరావు, ఎన్.అయ్యప్పరెడ్డి.. ఉన్నతాధికారులకు పదేపదే మెమోరాండంలు సమర్పించారు. పరిష్కారం దొరక్కపో వటంతో ఉద్యమంవైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.