విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తొలిదశ పనులు చేపట్టడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనలకు కూడా సర్కారు ఆమోదముద్ర వేసింది.
దీనిని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్రానికి పంపించింది. ఏపీ మెట్రోరైల్ ప్రాజెక్టుల రెండింటిలో ఒకటి రాష్ట్ర విభజన చట్టాన్ని అనుసరించి నూరుశాతం ఖర్చు భరించేలా, రెండోది నూతన మెట్రో పాలసీలో భాగంగా కేంద్రం పొందుపరిచిన కీలకమైన ‘క్లాజ్’ను ప్రాతిపదికగా తీసుకుని పూర్తి ఖర్చు భరించేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు.