ఫెంగల్ తుఫాన్‌పై రాష్ట్ర విపత్తుల నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఇప్పటికే స్పందించారు. శనివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ తుఫాన్ ప్రభావం కారణంగా నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.ఇక పలు జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే రైతులు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఇంకోవైపు ఈ ఫెంగల్ తుపాను కారణంగా.. తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో గత రాత్రి నుంచీ ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ కారణంగా.. చెంగల్‌పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుత్తురై, తిరువారూర్ జిల్లాల్లో స్టాలిన్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక కడలూరు, నాగపట్నం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరి, కారైకల్, కడలూరు ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.