కొత్తూరు వద్ద రైల్వే ఫ్లై ఓవర్ వంతెనపై నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో పలుచోట్ల గోతులు ఏర్పడ్డాయి. ఒకవైపు రోడ్డు మొత్తం పూర్తిగా దెబ్బతిని పాడైపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గోతులబారి నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ వంతెన మీదుగా అనకాపల్లి, కశింకోట, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు, వాహనదారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్‌అండ్‌బీ పరిధిలోని ఈ వంతెనపై మొక్కుబడిగా మరమ్మతులుచేసి చేతులు దులుపుకోవడంతో కొద్ది రోజులకే గోతులు ప్రత్యక్షం అవుతున్నాయి. వంతెన పాడవడానికి భారీ గ్రానైట్ బ్లాకులు, క్వారీ రాళ్లు, గ్రావెల్ రవాణా చేసే వాహనాలు రాకపోకలు సాగించడమే కారణమని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కుంచంగి, వేటజంగాలపాలెం, రొంగలివానిపాలెం గ్రామాల పరిధిలోని క్వారీల నుంచి పెద్ద పెద్ద బండరాళ్లను భారీ వాహనాలతో ఈ రోడ్డు మీదుగా రవాణా చేస్తుంటారు. వంతెన సామర్థ్యానికి మించిన బరువుతో భారీ వాహనాలు వెళుతుండడంతో వంతెన దెబ్బతింటున్నదని అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేని ఆరోపిస్తున్నారు.