శ్రీశైలం మహాక్షేత్రంలో కార్తీకమాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్తీక అమావాస్య కావడంతో ఆదివారం క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో క్షేత్ర పురవీధులన్నీ భక్తులతో రద్దీగా దర్శనమిచ్చాయి. భక్తులు వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో బారులుదీరారు.
రద్దీ అధికంగా ఉండటంతో స్వామివారి అలంకరణ దర్శనం కల్పించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయ ఉత్తర వీధి ప్రాంగణం, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద విశేష పూజలు నిర్వహించుకుని దీపారాధనలు జరిపారు. సాయంత్రం స్వామివారికి పల్లకీ ఉత్సవం, ఆకాశదీపం కార్యక్రమాలను నిర్వహించారు.