ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను రోడ్డున పడేశారని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అన్నదాతలు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదని, తుపాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ....... రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయింది. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి, అవసరమైన సౌకర్యాల కల్పనలో మీ ప్రభుత్వం విఫలమైంది. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతుల వద్ద ధాన్యం కొనే నాథుడే లేకుండాపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం వంకతో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
మద్దతు ధరకు కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు తేమ శాతం సాకుగా చూపి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. బస్తాకు రూ.300– రూ.400 నష్టానికి రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మద్దతు ధర దక్కడం రైతులకు ఎండమావిగా తయారైంది. 75 కిలోల బస్తాకు రూ.1725ల చొప్పున ఏ ఒక్కరికీ అందే పరిస్థితి లేకుండా పోయింది అని ట్వీట్ చేసారు.