వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లబించింది. భార్గవరెడ్డికి రెండు వారాలపాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోగా ఏపీ హైకోర్టును ఆశ్రయించి ఈ కేసులో వాదనలు వినిపించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేసులోని మెరిట్ ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది.కాగా టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులపై సజ్జల భార్గవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం నేడు విచారణ జరిపింది.
సజ్జల భార్గవ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని తెలిపారు. ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు పాల్పడ్డారని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించి వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసుపై రెండు వారాల్లో ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం తెలిపింది. అప్పటి వరకు ఆయన్ను అరెస్టు చేయకుండా ఉండాలని పేర్కొంది.