ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్రలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు.. చివరి నిమిషంలో షిండే ట్విస్ట్

national |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2024, 10:28 PM

మహారాష్ట్ర సీఎం ఎవరు అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక వైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతూనే ఉండగా.. మరోవైపు సీఎం ఎంపిక మాత్రం పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే మహాయుతి కూటమిలోని ముగ్గురు నేతలు.. సమావేశం అయి మంత్రివర్గం, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరపాల్సి ఉండగా.. ఆ భేటీ వాయిదా పడుతూ వస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ముంబైలో సమావేశం కావాల్సి ఉండగా.. ఏక్‌నాథ్ షిండే తన సొంత గ్రామానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత 2 రోజులు అక్కడే ఉన్న షిండే.. ప్రస్తుతం థానేకు చేరుకుని.. ఆస్పత్రిలో చేరారు. ఇక షిండే కారణంగానే ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోందన్న వార్తలను శివసేన నేతలు కొట్టిపారేస్తున్నారు. సీఎంగా ఎవరిని ఎంపిక చేసినా.. తాను అందుకు అంగీకరిస్తానని షిండే ఇప్పటికే బీజేపీ హైకమాండ్‌కు చెప్పారని స్పష్టం చేస్తున్నారు.


ఇక రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ.. ఏక్‌నాథ్ షిండే తాజాగా స్పందించారు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. కేవలం మెడికల్ టెస్ట్‌ల కోసమే ఆస్పత్రికి వెళ్లినట్లు చెప్పారు. మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్న వేళ.. షిండే ఆస్పత్రిలో చేరడం తీవ్ర అనుమానాలకు తావిచ్చిన వేళ.. ఆయన మాట్లాడారు.


ఇక బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలో ఉండగా.. షిండే శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే థానే ఆస్పత్రిలో చేరారు. ఇక ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వీరు ముగ్గురు కలిసి సమావేశం అయి.. ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ బెర్తు‌లపై చర్చించడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే షిండే వర్చువల్‌గా భేటీ అవుతారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.


ఇక బీజేపీ శాసనసభా పక్షం సమావేశం.. బుధవారం జరగనుంది. ఈ భేటీలోనే బీజేపీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. సీఎం రేసులో ముందువరుసలో ఉండగా.. హైకమాండ్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడం కొత్త ఊహాగానాలకు తావిస్తోంది. సీఎంను ఎన్నుకున్న తర్వాత రేపు మహాయుతి కూటమి నేతలు మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించనున్నారు. ఇక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం కోసం ముంబైలోని ఆజాద్ మైదానం సిద్ధం అవుతోంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.


ఇక ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న ఉత్కంఠ వేళ.. షిండే శివసేన నేత దీపక్ కేసార్కర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకనాథ్ షిండే నాయకత్వంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని.. అయితే ఆయన స్థాయిని నిలబెట్టడం బీజేపీ బాధ్యత అని తెలిపారు. నిజమైన శివసేనకు ఎవరు నాయకుడో ఇప్పటికే ఏక్‌నాథ్ షిండే నిరూపించారని.. ఇప్పుడు తన స్థాయిని ఎలా కాపాడాలో బీజేపీ హైకమాండ్ నిర్ణయించాలని.. ఆ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పారు. మరోవైపు.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో జరుగుతున్న జాప్యానికి ఏక్‌నాథ్ షిండేకు ఎలాంటి సంబంధం లేదని దీపక్ కేసార్కర్ వెల్లడించారు. అది బీజేపీ అంతర్గత విషయమని తేల్చి చెప్పారు. ఇక మహాయుతి కూటమిలో అంతర్గత పోరు ప్రారంభమైందన్న ఆరోపణలను కొట్టి పారేసిన దీపక్ కేసార్కర్.. మూడు పార్టీలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేస్తాయని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com