బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తమిళనాడు, పుదుచ్చేరిలకు అపార నష్టాన్ని మిగిల్చింది. తీరం దాటిన తర్వాత సముద్రం పక్కనే 13 గంటల పాటు కొనసాగి.. బీభత్సం సృష్టించింది. పుదుచ్చేరిలో అత్యధికంగా 50 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. గత 20 ఏళ్లలో అక్కడ నమోదయిన అత్యధిక వర్షపాతం ఇదే. అనేక నివాసాలు నీటమునిగాయి. తుఫానుకు తమిళనాడులో 18 మంది.. పుదుచ్చేరిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తుపాను కారణంగా వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగసామి ప్రకటించారు.
ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పుదుచ్చేరి, కారైకల్, యానంలోని 3.54 లక్షల మంది రేషన్‌కార్డుదారులు ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున అందిస్తామని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 4 వేల మంది సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. భారీ వర్షాలకు నలుగురు మృతి చెందారని, మరొకరు గల్లంతయినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు చెల్లించిస్తామని పేర్కొన్నారు. మొత్తం 10వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు అంచనా వేశామని, హెక్టార్‌కు రూ.30వేలు పరిహారం ప్రకటించారు.
అలాగే, చనిపోయిన పశువులకు పరిహారం ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. నాలుగు పశువులు చనిపోతే తలా రూ.40 వేలు, 16 దూడలకు తలా రూ.20వేలు, పడవలు ధ్వంసమైతే తలా రూ.10వేలు, పూరి గుడిసెలకు తలా రూ.10వేలు అందిస్తామని చెప్పారు. విపత్తు సాయంగా రూ.210 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి రంగసామి వెల్లడించారు. దెబ్బతిన్న రహదారులు, వంతెనలకు మరమ్మతులకు తొలి విడతగా రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశామని, దీనిపై కమిటీ వచ్చి పరిశీలించాలని కోరామన్నారు. ఇక, నూంగుకుప్పం ప్రాంతంలో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో స్థానికులను ఆర్మీ జవాన్లు సోమవారం నాడు రక్షించి పడవల్లో శిబిరాలకు తరలించారు. ఇక, తుఫాను క్రమంగా బలహీనపడి.. అల్పపీడనంగా మారినట్టు ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.