ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈవీఎంలపై అనుమానం.. బ్యాలెట్‌తో గ్రామస్థులు రీపోలింగ్!

national |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2024, 10:34 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ నేతలు మాత్రం ఈవీఎంలను అనుమానిస్తున్నాయి. ఇది ప్రజా తీర్పు కాదని, ఈవీఎంలను ట్యాపరింగ్ చేశారని ఆరోపిస్తున్నాయి. అలాగే, సోలాపూర్ జిల్లా మల్షిరాస్ నియోజకవర్గంలోని గ్రామానికి చెందిన ఓటర్లు సైతం ఇదే సందేహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో మహావికాస్ అఘాడీ మద్దతుదారులు అధికంగా ఉంటే.. ఓట్లు మాత్రం బీజేపీ అభ్యర్ధికి ఎక్కువ వచ్చాయని, ఈవీఎం వల్లే ఇలా జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ బ్యాలెట్‌తో రీపోలింగ్‌కు గ్రామస్థులు సిద్దమయ్యారు. మంగళవారం రీపోలింగ్ చేయాలని నిర్ణయించారు.


మల్షిరాస్ నియోజకవర్గం నుంచి ఎంవీఏ అభ్యర్ధిగా పోటీచేసిన ఎన్సీపీ (శరద్ పవార్) నేత ఉత్తమరావు జనకర్ విజయం సాధించారు. అయితే, మర్కాడివాడీ గ్రామంలో అధిక శాతం ఎంవీయే మద్దతుదారులు కాగా.. ఓట్లు మాత్రం బీజేపీ అభ్యర్ధికే ఎక్కువ పోలయ్యాయి. దీంతో గ్రామస్థులు షాకయ్యారు. తామంతా ఉత్తమరావుకే ఓటేస్తే.. బీజేపీ అభ్యర్ధికి తమ గ్రామంలో మెజార్టీ ఎలా వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో బ్యాలెట్ పేపర్‌తో మంగళవారం రీ-పోలింగ్ చేపట్టాలని నిర్ణయించారు. అయితే, సోలాపూర్ జిల్లా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అటువంటి చర్యలతో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు.


ముందుజాగ్రత్తగా పోలీసులను గ్రామంలో మోహరించారు. సోలాపూర్ ఎస్పీ అతుల్ కులకర్ణి మాట్లాడుతూ.. ‘ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దని గ్రామస్థులకు అధికారులు సూచించారు’ అని అన్నారు.


గ్రామానికి చెందిన రంజీత్ మర్కడ్ మాట్లాడుతూ.. ‘మా గ్రామంలో 2000 మందికిపైగా ఓటర్లు ఉన్నారు.. నవంబరు 20న జరిగిన పోలింగ్‌లో 1,900 ఓట్ల పోలయ్యాయి.. మా గ్రామం ఎప్పుడూ జనక్‌రావు, మోహితే పాటిల్ కుటుంబానికి మద్దతు. కానీ, ఈ ఎన్నికల్లో జనక్‌రావుకి 843 ఓట్లు, బీజేపీ అభ్యర్ధికి 1,003 ఓట్లు వచ్చాయి.. మాకు ఈసీ డేటాపై నమ్మకం లేదు... అందుకే డిసెంబరు 3న బ్యాలెట్‌తో రీపోలింగ్ చేపట్టి..ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరిస్తాం’ అని తెలిపారు.


ఈ ఓటింగ్ కోసం గ్రామస్థులు విరాళాలు సేకరించి, అభ్యర్థుల ఫోటోలు, పేర్లతో కూడిన బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. అంతేకాదు, గ్రామంలో బ్యానర్లు ప్రదర్శించి.. ప్రతి ఒక్కళ్లూ ఓటువేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, ప్రక్రియ పర్యవేక్షణకు ప్రభుత్వ అధికారులను నియమించాలని కోరారు. అయితే, దీనికి అధికారులు నిరాకరించారు. ఇక, గ్రామంలోని బీజేపీ మద్దతుదారులు మాత్రం తాము ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించారు. ఇక, ఎమ్మెల్యేగా ఎన్నికైన జనకర్ గ్రామానికి చేరుకుని, వారికి మద్దతు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com