సామాజిక సమస్యపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన పాపానికి పులి సాగర్ అనే విద్యావంతుడైన దళిత యువకుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, పోలీసులు అమానవీయంగా వ్యవహరించిన ఘటన రాజమహేంద్రవరం చోటుచేసుకుంది. సాగర్ ను అర్థనగ్నంగా రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ లోని సెల్ లో పెట్టి, మహిళా కానిస్టేబుళ్ళను కాపలాగా ఉంచిన సీఐ ఎస్ కె బాజీరావు దాష్టీకం వెలుగులోకి రావడంతో ఇది సంచలనంగా మారింది. తనకు జరిగిన అవమానం, కులం పేరుతో చేసిన దుర్భాషలు, చంపుతామంటూ సీఐ చేసిన బెదరింపులు, అర్థనగ్నంగా మహిళా కానిస్టేబుళ్ళ ముందు నిలుచోబెట్టి ఆత్మగౌరవంను కించపరిచేలా పోలీసులు చేసిన వేధింపులతో మనస్థాపంకు గురైన దళిత యువకుడు వైయస్ఆర్ సిపి నేతలను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
బాధిత యువకుడు పులి సాగర్ తో కలిసి తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి మాజీ ఎంపి, వైయస్ఆర్సిపి అధికార ప్రతినిధి మార్గాని భరత్, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి, మాదిగ కార్పోరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావులు నిర్వహించిన మీడియా సమావేశంలో జరిగిన సంఘటనను మీడియా ముందు వెల్లడించారు.