నర్సాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు సీఐడీ కస్టోడియల్ హింస కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. గుంటూరు జీజీహెచ్‌లో వైద్య నివేదికకు సంబంధించి అసలు ఏమి జరిగిందనే కోణంలో బుధవారం కేసు విచారణాధికారి, ప్రకాశం ఎస్పీ ఏఆర్‌దామోదర్ విచారణ చేపట్టారు. తనపై సీఐడీ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, అందుకు సంబంధించి జీజీహెచ్‌లో ఇచ్చిన నివేదిక మార్పు చేశారని తన ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు.
దీంతో అప్పట్లో సీఐడీలో పనిచేసిన ముగ్గురు సిబ్బందిని మంగళవారం విచారించారు. బుధవారం జీజీహెచ్‌లో పనిచేస్తున్న ఆర్‌ఎంవో సతీశ్ కుమార్, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ రాజేంద్ర, ఈసీజీ టెక్నీషియన్ నాగరాజులను ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విచారించారు. సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేసిన అనంతరం స్టేట్‌మెంట్ రికార్డు చేసుకుని పంపించారు.