రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వందల కోట్ల పన్నుల ఎగవేత, అంతకుమించి సెస్ ఎగ్గొట్టేందుకు బిల్లులు రీ సైక్లింగ్ చేస్తున్న వైనంపై ఫిర్యాదులు అందాయి. దీంతో గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వం విజిలెన్స్‌ను రంగంలోకి దింపింది. గుట్కా మాఫియా రాయలసీమ నుంచి విజయవాడ వరకు గుట్కా ఉత్పత్తులను కర్ణాటక నుంచి తెచ్చుకుని విక్రయిస్తోంది. ఎక్కువగా ఒక ట్రిప్పులో వాహనానికి 60 బ్యాగులు లోడు చేయించి తీసుకొస్తారు. దాని విలువ రూ.5,19,312 కాగా జీఎస్టీ రూ.1,45,407 చెల్లించాలి. దీంతోపాటు సెస్ రూ.10,48,320 కలిపి మొత్తం రూ.17,14,752 అవుతుంది. దీనికి తగినట్లు గుట్కా డీలర్లు, రిటైలర్లు, సరఫరా చేసేవారు, కిరాణా వ్యాపారులు వారి వారి స్థాయిలో లాభాన్ని వేసుకుని గుట్కా విక్రయాలు చేస్తారు.
అసలు సరుకు రూ.5.19 లక్షలు కాగా జీఎస్టీ, సెస్ అన్నీ కలిపి రూ.17.15 లక్షల వరకు చెల్లించడం సరికాదని భావించింది. ఎస్టీ ఎగ్గొట్టేందుకు నకిలీ వే బిల్లులు, నకిలీ జీఎస్టీ నెంబర్లు తీసుకుని ఎక్కడికక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేసింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఐదారుగురు ప్రధాన డీలర్లు మాఫియాగా ఏర్పడి ప్రభుత్వానికి రావాల్సిన సెస్ ఎగ్గొడుతున్నారు. గుట్కా మాఫియాపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ రంగంలోకి దిగింది. నెల్లూరు, చిత్తూరు, గుంటూరు జిల్లాలపై అధికారులు నిఘా పెట్టారు. నెల్లూరులో కీలక డీలరు గోడౌన్‌లో బుధవారం సోదాలు నిర్వహించి పలు అక్రమాలు గుర్తించారు. వెంటనే వ్యాపారులు.. అధికారులపై ఒత్తిళ్లు తెచ్చే యత్నం చేశారు. పలు జిల్లాల్లో గుట్కా గోడౌన్లు మూసేశారు. వ్యాపారాలు బంద్ చేశారు. కీలక అధికారులకు ఫోన్లు చేయించారు. అయినప్పటికీ అధికారులు వెనక్కి తగ్గకుండా మాఫియా పని పడతామని తేల్చి చెప్పారు. దీంతో హవాలా రూపంలో రూ.వందల కోట్లు తీసుకుంటున్న మహారాష్ట్ర బడా వ్యాపారిని మాఫియా రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తోంది.