ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలంలో యురేనియం తవ్వకాలను నిలిపివేస్తూ ప్రకటన చేయాలని ఆ లేఖ ద్వారా కోరారు. ఏపీలో యురేనియం తవ్వకాల కోసం ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రయత్నించటం తగదని అన్నారు. ప్యాపిలి మండలంలో మామిడిపల్లి, రాంపల్లి, జక్కసానికుంట గ్రామాల్లో ప్రజలు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారని, యురేనియం తవ్వకాల వల్ల స్థానిక గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోయి పలు ఇబ్బందులు, అనారోగ్య సమస్యల పాలయ్యే ప్రమాదం ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జక్కసానికుంట్ల గ్రామంలో రామకృష్ణ ర్యాలీ చేపట్టారు.అనంతరం గ్రామ శివారులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
యురేనియం తవ్వకాలు చేపట్టడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతారని, గతంలో జార్ఖండ్ రాష్ట్రంలో 600 మందికిపైగా కేన్సర్ బారిన పడ్డారని తెలిపారు. ప్యాపిలి మండలంలో యురేనియం తవ్వకాల వల్ల మూడు గ్రామాల ప్రజలే కాక గుడిపాడు, ప్యాపిలి, రాయలచెరువు వరకు దీని ప్రభావం ఉంటుందని వివరించారు. ఈ విషయమై అన్ని పార్టీలతో చర్చించి, ముఖ్యమంత్రికి లేఖ రాస్తానన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాల కోసం ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారని చెప్పారు. ప్రజల నిరసనలతో తవ్వకాలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఇప్పుడు ప్యాపిలి మండలంలో తవ్వకాలకు సన్నద్ధం కావడం సరికాదన్నారు.