కూటమి పాలనలో బీసీలు, కాపులు, దళితులను అణచివేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధాన్యం ధర రూ. 2 వేలుగా ఉంటే... చంద్రబాబు పాలనలో రూ. 1,400కే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. కాకినాడ సెజ్ లో తాను 6 ఎకరాల భూమిని కొన్నానని... మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు రైతుల నుంచి భూమి కొనుగోలు చేశానని దాడిశెట్టి తెలిపారు. 1940 నుంచే తమ కుటుంబం బంగారం వ్యాపారంలో ఉందని... తమ వద్ద డబ్బులు ఉండటం వల్లే రైతులు అమ్మిన భూమిని కొన్నానని చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, యనమల రామకృష్ణుడు కొన్న ఆస్తులన్నీ ప్రజల నుంచి దోచుకున్నవేనని ఆరోపించారు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు యనమల వద్ద రూ. 2 లక్షలు కూడా లేవని... రైతు సంఘాలు ఆ ఖర్చులను భరించి ఆయనను గెలిపించాయని చెప్పారు. ఈరోజు యనమల వద్ద వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఆ అక్రమాస్తులను పేదలకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీలో ఉన్నాం కాబట్టి తాము ఆస్తులు కొనుగోలు చేయకూడదా? అని ప్రశ్నించారు. విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ చేయాలని... లేదంటే వైసీపీ ఉద్యమాన్ని చేపడుతుందని హెచ్చరించారు