రోజులు మారిపోయాయి. నేరగాళ్లు రూటు మార్చారు. ఒకప్పుడు ఇంట్లోకి దూరి చోరీ చేసేవాళ్లు. ఆ తర్వాత చైన్ స్నాచింగ్‌లు మొదలెట్టారు. ఇప్పుడు దొంగలు కూడా అప్ డేట్ అయ్యారు. ఇంటిలోకి ప్రవేశించకుండానే, కాలు కదపకుండానే సొమ్మ కాజేస్తున్నారు. అదే సైబర్ మోసం. ప్రస్తుత సమాజంలో చాప కింద నీరుల విస్తరిస్తున్న అతిపెద్ద నేరం. ప్రస్తుత రోజుల్లో సెల్ ఫోన్ దగ్గర నుంచి సిమ్ వరకూ, ప్రతి సర్వీసుకు కస్టమర్ కేర్ నంబర్లు ఇస్తున్నారు. సేవల్లో ఏదైనా అంతరాయం కలిగితే వారిని సంప్రదించాలని సూచిస్తున్నారు. అలా కస్టమర్ కేర్ నంబర్‍కు ఫోన్ చేయబోయి.. ఆర్టీసీ ఉద్యోగి సైబర్ వలలో పడిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వస్తే.. తిరుపతి రూరల్ మండలం ధనలక్ష్మి నగర్‌లో సురేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. సురేంద్రనాథ్ రెడ్డి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నారు. నవంబర్ 26వ తేదీన సురేంద్రనాథ్ రెడ్డి తన ఇంట్లో డిష్ యాక్టివేట్ చేయాలని ప్రయత్నించారు. ఇందుకోసం కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ కోసం ట్రై చేస్తే ఆన్‌లైన్‌లో వెతికితే ఓ నంబర్ కనిపించింది. దీంతో సురేంద్రనాథ్ రెడ్డి ఆ నంబర్‌కు ఫోన్ చేశారు. అలా సైబర్ వలలో పడ్డారు. కాల్ సమయంలో సురేంద్రనాథ్ రెడ్డిని మాటల్లో పెట్టిన సైబర్ మోసగాళ్లు.. వాట్సప్ ద్వారా ఓ యాప్ అతనితో డౌన్ లోడ్ చేయించారు.రుస్ట్ డెస్క్ అనే రిమోట్ యాక్సెస్ యాప్ డౌన్‌లోడ్ చేయించి.. సురేంద్రనాథ్ రెడ్డి ఫోన్ కంట్రోల్‌లోకి తీసుకున్నారు.
ఆ తర్వాత డిష్ యాక్టివేషన్ డబ్బును వెనక్కి పంపామని సురేంద్రనాథ్ రెడ్డిని నమ్మబలికి.. ఒక్కసారి చెక్ చేసుకోవాలని సూచించారు. దీంతో వారి మాటలను నమ్మిన సురేంద్రనాథ్ రెడ్డి అమెజాన్ పే, ఫోన్ పేల ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. ఈ సమయంలోనే సైబర్ నేరగాళ్లు సురేంద్రనాథ్ రెడ్డి బ్యాంకు అకౌంట్ నుంచి రూ.90 వేలు, అతని కుమార్తె అకౌంట్లోని రూ.28 వేలు కాజేశారు. అ తర్వాత మోసపోయిన సంగతి గ్రహించిన సురేంద్రనాథ్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.