వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టుల విషయంలో వైసీపీకి చెందిన వర్రా రవీంద్రారెడ్డి అరెస్టైన సంగతి తెలిసింది. వర్రా రవీంద్రారెడ్డి కేసులో విచారణకు హాజరు కావాలంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఉదయం కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు బండి రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణలో ఉంది. డిసెంబర్ 12వ తేదీన విచారణకు రానుంది. అయితే అప్పటి వరకూ బండి రాఘవరెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న బండి రాఘవరెడ్డి.. ఆదివారం పులివెందులలో ప్రత్యక్షమయ్యారు. దీంతో పులివెందుల పోలీసులు బండి రాఘవరెడ్డి ఇంటికి వెళ్లారు. విచారణకు రావాలని కోరారు. అయితే నోటీసులు ఉంటే తప్ప విచారణకు రానని బండి రాఘవరెడ్డి చెప్పినట్లు తెలిసింది. మౌఖికంగా పిలిస్తే రానని.. నోటీసులు ఉంటేనే వస్తానంటూ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో పులివెందుల పోలీసులు బండి రాఘవరెడ్డికి నోటీసులు ఇచ్చారు. సోమవారం ఉదయం కడపలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించారు.
మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, వైఎస్ షర్మిల వంటి విపక్ష నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిపై కేసు నమోదైంది. పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం అతను కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. దీంతో విచారణ కోసం పోలీసులు బండి రాఘవరెడ్డికి నోటీసులు ఇచ్చారు.