మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లోని అసైన్డ్ భూములను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం, పిన్నెల్లిలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లోని అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంది. వేమవరంలోని 13.80 ఎకరాల అసైన్డ్ భూమి, పిన్నెల్లిలో 3.89 ఎకరాల అసైన్డ్ భూమి.. మొత్తంగా 17.69 ఎకరాల అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంది. ఈ మేరకు స్థానిక తహశీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు.
సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు సంబంధించి ఇటీవలే వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. వైఎస్ కుటుంబంలో ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలోనే పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లో అసైన్డ్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన 1500 ఎకరాల్లో కొండభూములు, ప్రకృతి సంపద, వాగులు, వంకలతో పాటుగా అసైన్డ్ భూములు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. తమ అసైన్డ్ భూములను బలవంతంగా తీసుకున్నారంటూ కొంతమంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఉన్నతాధికారులతో చర్చించారు. సరస్వతి పపర్ ఇండస్ట్రీస్ సంస్థ భూముల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములు, జలవనరులు ఎంత ఉన్నాయనే దానిపై సర్వే చేయాలని ఆదేశించారు.
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రెవెన్యూ, అటవీశాఖ అధికార యంత్రాంగం స్పందించింది. పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లోని సరస్వతి పవర్ ఇండస్టీస్ సంస్థ భూముల్లో సర్వే చేశారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు కలిసి జీపీఎస్ సర్వే నిర్వహించారు. అలాగే ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎంబీ రికార్డులను తనిఖీ చేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగానే మాచవరం మండలంలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లోని 17.69 ఎకరాల అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు మాచవరం తహశీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ భూములను పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు తమ భూములను బలవంతంగా తీసుకున్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.