రాష్ట్రంలో రైతుల సమస్యపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట పట్టింది. అందులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీల్లో రైతులు కదం తొక్కారు. పార్టీ శ్రేణులు కూడా ర్యాలీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ధాన్యం సేకరణలో జరుగుతున్న అన్యాయంపై నిలదీయడంతో పాటు, కనీస మద్ధతు ధర కల్పించాలని, పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేలు వెంటనే ఇవ్వాలని, గత ప్రభుత్వ హయాంలో పక్కాగా అమలైన ఉచిత పంటల బీమాను యథాతథంగా ఇప్పుడు కూడా రైతులకు వర్తింప జేయాలన్న డిమాండ్లతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించే కార్యక్రమం చేశారు. పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీలు నిర్వహించి, తమ సమస్యలు పరిష్కరించాలంటూ రైతులతో కలిసి పార్టీ నాయకులు జిల్లా అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.