ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసేందుకు ఓ యువ రైతు 760 కిలోమీటర్లు ఎడ్లబండిపై ప్రయాణం చేసి మంగళగిరి చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. నవీన్ అనే రైతు హిందూపురం నుంచి ఎడ్లబండిపై 28 రోజుల పాటు ప్రయాణించి ఇటీవల మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నాడు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను పవన్ కు చెప్పాలని ఆ రైతు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా వందలాది కిలోమీటర్లు ఎడ్లబండిపై ప్రయాణించాడు. ఆయా ప్రాంతాల్లోని రైతులతో మాట్లాడుతూ వారి సమస్యలు కూడా తెలుసుకున్నాడు. గత మూడు రోజులుగా తాను పవన్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. రైతుల కష్టాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసేందుకు అనుమతించాలని ఆ రైతు అభ్యర్థించాడు.