ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 నెలల పసికందును చెరువులో పడేసిన తల్లి.. తిరిగొచ్చి షాకిచ్చిన నవజాత శిశువు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 07:31 PM

అమ్మ, అమ్మ ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. తమ బిడ్డల కోసం లోకంలో ఎవరూ చేయని పనులు చేస్తూ.. తల్లులు తమ ప్రేమను ప్రపంచానికి చాటిచెబుతుంటారు. కానీ మరికొందరు మాత్రం అమ్మతనానికే మచ్చలుగా మారి అన్యాయంగా ప్రవరిస్తుంటారు. అలాంటి ఓ తల్లి గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కర్ణాటకకు చెందిన ఓ మహిళ ఇటీవలే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ అప్పటి నుంచి ఆ బుజ్జాయిని వదిలించుకోవాలని చూస్తోంది. తాజాగా తన రెండు నెలల వయస్సున్న చిన్నారిని ఓ చెరువులోకి విసిరేసి.. తనకేం సంబంధం లేదు అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కానీ ఆ చిన్నారి మళ్లీ ప్రాణాలతో తిరిగొచ్చి ఆ తల్లికి షాక్ ఇచ్చింది.


కర్ణాటకలోని రామ్‌తీర్ నగర్‌కు చెందిన 35 ఏళ్ల శాంతా రాబర్ట్ కరవినకొప్పికి ఇటీవలే ఓ పండంటి మగబిడ్డ జన్మించాడు. అయితే పుట్టినప్పుడు బాగానే ఉన్న శిశువుకు ఆ తర్వాత అనారోగ్య సమస్యలు వచ్చాయి. బిడ్డ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఓసారి ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. చిన్నారికి మూర్చ వ్యాధి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే అందరి తల్లుల్లా.. తన బిడ్డ ఆరోగ్యం బాగాలేకపోతే అనుక్షణం ఆందోళన చెందుతూ.. చిన్నారిని కంటికి రెప్పలా కాచుకోవడానికి బదులుగా ఆమె మాత్రం ఓ దారుణానికి ఒడిగట్టింది.


అనారోగ్య సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్న ఆ బిడ్డను వద్దు అనుకుంది. ఎలాగైనా సరే ఆ చిన్నారిని వదిలించుకోవాలని భావించిన ఆమె.. స్థానికంగా ఉన్న ఓ చెరువు వద్దకు వెళ్లింది. పట్టపగలు.. అందరూ చూస్తుండగానే చిన్నారిని చెరువులో పడేసింది. ఆపై అటువైపు కూడా చూడకుండా తనకేం సంబంధం లేదు అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోబోయింది. అయితే విషయం గుర్తించిన కన్హయ్య జంబాలి అనే వ్యక్తి వెంటనే అక్కడి మత్స్యకారులకు విషయం చెప్పాడు.


అలా అందరూ కలిసి చెరువులోకి దూకి.. చిన్నారిని రక్షించారు. ఆపై ఆ బుజ్జాయిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే బిడ్డ తల్లి శంతా రాబర్ట్‌ను పట్టుకున్న స్థానికులు.. పోలీసులకు విషయాన్ని వివరించి మరీ ఆమెను అప్పజెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను అరెస్ట్ చేసి విచారించారు. శాంతా రాబర్ట్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని.. మూడో సంతానంగా పుట్టిన బాబుకు మూర్చ వ్యాధి సోకిందని, ఆస్పత్రులు చుట్టూ తిప్పేంత డబ్బులు లేకే బిడ్డను చంపుకోవాలని చూసినట్లు విచారణలో మహిళ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలపారు. అలాగే ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న శాంతా రాబర్ట్ భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టపగలే చిన్నారిని చెరువులోకి విసిరిన ఘటన తెలుసుకుని బెళగావి వాసులంతా దిగ్ర్భాంతికి గురయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com