నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం రాగల 48 గంటల్లో మరింత బలపడుతుందని, పశ్చిమ వాయవ్య దిశగా తమిళనాడు తీరం వైపు పయనించే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వివరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో రేపు (డిసెంబరు 18) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని... శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది