మీరు గమనించే ఉంటారు.. మన దేశంలో చాలా చట్టాలను మహిళలను ఉద్దేశించి రూపొందించారు. ఏ కేసులో నైనా ముందుగా మహిళకే రక్షణ కల్పిస్తారు. ఆమె ఇచ్చే స్టేట్‌మెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.ఐతే.. ఈమధ్య కాలంలో.. తమకు అనుకూలంగా ఉన్న చట్టాలను ఉపయోగించుకొని కొంతమంది మహిళలు.. అరాచకాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఇదో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. మహిళలే భర్తలను వేధిస్తుంటే, భర్తలు బలైపోతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
బెంచ్ ఏమంది?
చట్టాల్లో ఉండే కఠినమైన నిబంధనలు మహిళల సంక్షేమం కోసమే కానీ, తమ భర్తలను శిక్షించడం, బెదిరించడం, వారిపై ఆధిపత్యం చెలాయించడం లేదా దోపిడీ చేయడానికి కాదు అని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ పంకజ్ మిథాల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహం పవిత్రమైన ఆచారమనీ, ఇది కుటుంబానికి పునాది లాంటిదే గానీ వాణిజ్య ఒప్పందం కాదు అని బెంచ్ వ్యాఖ్యానించిందిభారత న్యాయ సంహిత లోని అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, వివాహితపై క్రూరత్వం వంటి అనేక సెక్షన్లకు సంబంధించి వచ్చిన పిర్యాదులలో, ముఖ్యంగా వివాహ వివాదాలకు సంబంధించిన వాటిలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో మందలించిందనే విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది.
"మహిళల కోసం ఉన్న ఈ కఠినమైన నిబంధనలు వారి సంక్షేమం కోసం మాత్రమే. వీటిని అడ్డం పెట్టుకొని తమ భర్తలను శిక్షించడం, బెదిరించడం, ఆధిపత్యం చెలాయించడం లేదా దోపిడీ చేయడం వంటివి చేయకూడదు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి" అని ధర్మాసనం తెలిపింది.
ఏ కేసులో ఈ వ్యాఖ్యలు:
విడివిడిగా జీవిస్తున్న జంటలు.. విడాకులు తీసుకుంటున్న సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. "క్రిమినల్ చట్టంలోని నిబంధనలు మహిళల రక్షణ, సాధికారత కోసం ఉద్దేశించినవి, అయితే కొన్నిసార్లు కొందరు మహిళలు వాటిని వారికి ఉద్దేశించని ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తున్నారు" అని బెంచ్ తెలిపింది.2021 జులైలో వివాహం జరిగిన ఈ కేసులో.. భర్త అమెరికాలో ఐటీ కన్సల్టెంటుగా పనిచేస్తున్నాడు. అందువల్ల విడాకులు కోరిన భార్య, తనకు రూ.500 కోట్లు భరణం ఇవ్వాలని కోరింది. దీన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు.. ఫైనల్, పర్మనెంట్ సెటిల్మెంట్‌గా రూ.12 కోట్లు భరణం చెల్లించాలని ఆదేశించింది. ఇలా ఆమె రూ.500 కోట్లు భరణం కోరడంతో సుప్రీం బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది