ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తక్షణ కర్తవ్యంగా గుర్తించాలని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి అన్నారు. విద్యా రంగంలో సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు సాగించాలన్నారు. అమలాపురం ఎంప్లాయీస్ హోంలో ఆదివారం యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) మాట్లాడుతూ ప్రస్తుతం ఉపాధ్యాయులపై ఉన్న అదనపు పని భారాన్ని ప్రభుత్వం తగ్గించాలన్నారు. పాఠ్యాంశాలు బోధించేందుకు మాత్రమే పరిమతం చేయాలన్నారు. ప్రతీ ఆదివారం తరగతులు నిర్వహించాలని ఇచ్చిన సర్క్యులర్‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ఎస్.జ్యోతిబసు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణం విడుదల చేయాలన్నారు. నూతన పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను వెంటనే నియమించి ఐఆర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు ఎన్నికల అధికారిగా జిల్లాశాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. టీచర్స్ ఒలింపిక్స్-2024 పోటీల్లో విజేతలైన ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీలు ఐవీ, బొర్రా చేతులమీదుగా షీల్డులు అందజేశారు.