వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అధికారికంగా షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. కాగా ఇటీవల జరిగిన ఐసీసీ సమావేశంలో టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆ తటస్థ వేదిక ఏంటనేది.. ఆతిథ్య దేశమైన పాకిస్థాన్ నిర్ణయించాల్సి ఉంటుంది. తాజాగా పాకిస్థాన్.. తటస్థ వేదికను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
యూఏఈ వేదికగా భారత్ ఆడే మ్యాచ్‌లు నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించిందట. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి కూడా అధికారికంగా తెలిపిందని సమాచారం. ఈ మేరకు పీసీబీ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా యూఏఈలో మొత్తంగా మూడు అంతర్జాతీయ స్టేడియాలు ఉన్నాయి. దుబాయ్, షార్జా, అబుదాబీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి.
ఇక తటస్థ వేదిక కూడా ఖరారు కావడంతో అతి త్వరలో టోర్నీ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పీసీబీ ఇప్పటికే ముసాయిదా ప్రకటించిందని.. షెడ్యూల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాని ప్రకారం, ఫిబ్రవరి 23న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అయితే షెడ్యూల్ రెండు రకాలుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. భారత్.. సెమీఫైనల్, ఫైనల్ చేరితే మ్యాచులను ఒకచోట.. చేరకపోతే మరోచోట మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, సెమీ ఫైనల్ 1.. మార్చి 4న జరగనుంది. భారత్ సెమీస్ చేరితే యూఏఈలో.. చేరకపోతే పాకిస్థాన్‌లో మ్యాచ్ జరుగుతుంది. సెమీ ఫైనల్ 2.. మార్చి 5న పాకిస్థాన్‌లో జరగనుంది. ఇక ఇదే సమయంలో ఫైనల్ మ్యాచ్.. లాహోర్ లేదా యూఏఈ వేదికల్లో మార్చి 9న జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్.. సెమీఫైనల్, ఫైనల్ చేరితో మార్చి 4, మార్చి 9 తేదీల్లో మ్యాచులు జరగనున్నాయి. టోర్నీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్‌తో పాటు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పాల్గొననున్నాయి.