గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ.. భక్తజనసంద్రంగా మారింది. శబరిమలకు రికార్డు స్థాయిలో అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు. శరణుఘోషతో శబరిమల ప్రతిధ్వనిస్తోంది.కిలో మీటర్ల మేర క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి. అయ్యప్ప దర్శనం కోసం 12 గంటలకు పైగా సమయం పడుతోంది. సోమవారం సన్నిధానాన్ని దర్శించుకున్న భక్తుల సంఖ్య లక్ష మార్క్ ను టచ్ చేసింది. లక్షా ఆరు వేల మంది భక్తులు అయ్యప్ప సన్నిధానాన్ని దర్శించారు. ఈ సీజన్‌లో ఇది రికార్డు. అయ్యప్ప నెల దర్శనం, నక్షత్ర దర్శనాల కోసం భక్తులు ముందుస్తుగా రిజర్వేషన్ చేసుకుని తరలివచ్చారు. స్పాట్ బుకింగ్ ద్వారా 22,769 మంది దర్శనాలు చేసుకున్నారు.ఇక ఈ సీజన్‌లో నిన్నటి వరకు మొత్తం30,78,050 మంది భక్తులు శబరిమలను సందర్శించారు. గతేడాది కంటే ఈసారి 4, 45,000 మంది భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. రద్దీ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక ఇవ్వాళ్టి నుంచి రష్ మరింత పెరిగే అవకాశం వుంది. ఇప్పటికే కిలోమీటర్ల మేర క్యూ లైన్‌లు కిటకిటలాడుతున్నాయి. రెండు మూడు రోజుల క్రితం వరకు భక్తుల సంఖ్య 80 వేల వరకు ఉండేది.సోమవారం భక్తుల సంఖ్య లక్షను క్రాస్ చేసింది. కానీ ఏర్పాట్లు ఆ స్థాయిలో లేకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రద్దీ వేల సంఖ్యలో ఉంటే క్రమబద్దీకరించడానికి పోలీసుల సంఖ్య వందల్లో కూడా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కేరళ ప్రభుత్వం ఆదేశించినా.. పోలీసులకు -దేవస్థానంకు మధ్య సమన్వయం కొరవడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడే ఇలా వుంటే మకర జ్యోతి నాటికి పరిస్థితి ఏంటన్నది చర్చగా మారింది.