ఎలాంటి ఆధారాలు లేకుండా ఈవీఎంలను తాను నిందించలేనని ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ఈవీఎంలపై కాంగ్రెస్ సహా పలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఈవీఎంలను నిందించడాన్ని తప్పుబట్టారు. తాజాగా, ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేశారు.ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లోనే తాను నాలుగుసార్లు విజయం సాధించానన్నారు. అలాంటప్పుడు అందులో స్కాం ఉందని ఎలా చెప్పగలుగుతామని వ్యాఖ్యానించారు. ఆధారాల్లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేమన్నారు. ఈవీఎంలలో అవకతవకలపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో వాస్తవాలను బయటకు తీసుకువచ్చేలా చర్చ జరగాల్సి ఉందని సుప్రియాసూలే అభిప్రాయపడ్డారు.ఓటర్ల జాబితాపై చాలామంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, కాబట్టి ఈవీఎం అయినా... బ్యాలెట్ పేపర్ అయినా పారదర్శకంగా జరిగితే ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని తెలిపారు. ప్రజలు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరుకుంటే అలాగే చేయాలని, ఈవీఎంలు కావాలనుకుంటే వాటినే ఏర్పాటు చేయాలన్నారు.