భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణంతో దేశాధినేతలతో పాటు ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తున్నారు. దేశానికి సరికొత్త దశ, దిశ చూపిన మాజీ ప్రధాని సేవలను కొనియాడుతూ సంతాపం తెలిపారు. తమ దేశాలతో భారత్‌కు ఏర్పడిన బంధంలో మన్మోహన్ సహకారాన్ని, స్నేహపూర్వక సంబంధాలను గుర్తుచేసుకున్నారు. ఆయన మృతిపై అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ స్పందిస్తూ.. భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రపంచంలోని గొప్ప ఛాంపియన్‌లలో మన్మోహన్ ఒకరని అన్నారు. గత రెండు దశాబ్దాల్లో ఇరు దేశాలు సాధించిన ప్రగతికి ఆయన పునాది వేశారని పేర్కొన్నారు. యూఎస్, ఇండియా పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకుతీసుకెళ్లడంలో మన్మోహన్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలకు ఎల్లవేళలా గుర్తుండిపోతాయన్నారు.
‘‘భారత మాజీ ప్రధానమంత్రి, నా స్నేహితుడు మన్మోహన్ సింగ్ మరణవార్త నన్నెంతో బాధించింది. అతడు అసాధారణమైన తెలివితేటలు, చిత్తశుద్ధి, వివేకం కలిగిన వ్యక్తి. అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ మా సంతాపాన్ని తెలియజేస్తున్నాము’’ - కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్