ఇటీవలి కాలంలో కొన్ని పెళ్లిళ్లు.. పీటలపై ఆగిపోతున్న ఘటనలు పెరుగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే అందులో చాలా వరకు చిన్న చిన్న కారణాలతో చివరి నిమిషంలో పెళ్లి ఆపుకుని వెళ్లిపోయిన వధూవరుల కుటుంబాలు ఉన్నాయి. చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి.. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం, పెళ్లి మండపంలోనే కొట్టుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా పెటాకులైన ఓ పెళ్లి గురించి వింటే మాత్రం.. అసలు ఇలా కూడా జరుగుతుందా అని అనుకోకుండా ఉండలేరు. ఎందుకంటే పెళ్లిలో భోజనాలు ఆలస్యం అయ్యాయి అన్న కారణంతో వరుడు తీవ్ర అవమానంగా భావించి.. ఆ పెళ్లిని రద్దు చేసుకుని.. తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ వెంటనే మరో పెళ్లి కూడా చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈనెల 22వ తేదీన మెహతాబ్ అనే వరుడు.. తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి.. ఊరేగింపుగా హమీద్ పూర్ గ్రామంలో ఉన్న పెళ్లి మండపానికి చేరుకున్నారు. అయితే పెళ్లిలో భోజనం కాస్త ఆలస్యం అయింది. పెళ్లి కుమారుడి తరఫు బంధువులకు రోటీలు ఆలస్యంగా వడ్డించారు. దీంతో వరుడి తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ చిన్న గొడవ ప్రారంభం అయింది. అది కాస్తా పెద్దది కావడంతో పెళ్లి కుమారుడి తరఫు బంధువులు పెళ్లి రద్దు చేసుకుని.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెళ్లి కుమార్తె తరఫు బంధువులు.. వరుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత పెళ్లి కుమారుడు మెహతాబ్.. అదే రాత్రి మరో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇక ఈ విషయం కాస్తా.. పెళ్లి క్యాన్సిల్ అయిన వధువు తరఫు బంధువులకు తెలియడంతో వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. అయితే పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. వధువు కుటుంబ సభ్యులు డిసెంబర్ 24వ తేదీన చందౌలీ జిల్లా ఎస్పీని కలిశారు. ఈ పెళ్లి కోసం తాము రూ.7 లక్షలు ఖర్చు చేశామని.. వీటితోపాటు వరుడికి కట్నంగా రూ.1.5 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. తమ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మధ్యలో వదిలేసి మరో మహిళను పెళ్లి చేసుకున్న వరుడు మెహతాబ్, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఎస్పీని కోరినట్లు వధువు కుటుంబ సభ్యులు తెలిపారు.