నక్కపల్లి మండలంలోని ఒడ్డిమెట్ట వద్ద జాతీయ రహదారి పక్కనున్న ఒక దాబాలో గో మాంసంతో తయారు చేసిన వంటకాలను వడ్డిస్తున్నట్టు హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధుల తనిఖీల్లో బయటపడింది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి. పాయకరావుపేట మండలం నామవరం గ్రామానికి చెందిన కొంతమంది యువకులు శుక్రవారం రాత్రి ఒడ్డిమెట్ట వద్ద పెట్రోల్ బంకు పక్కన వున్న దాబాకు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. బిర్యానీలో మాంసం ముక్కలు పెద్దవిగా వుండడంతో అనుమానం వచ్చి, ఇతర జంతువులమాంసం ఏమైనా కలిపారా అని సిబ్బందిని ప్రశ్నించారు.
అటువంటిది ఏమీ లేదని వాళ్లు బదులిచ్చారు. అయినప్పటికీ యువకులు అనుమానం చెందుతూ పాయకరావుపేటకు చెందిన హిందూ ధార్మిక సంస్థ ప్రతినిధి ఎన్.శ్రీనుకు ఫోన్ చేసి చెప్పారు. ఆయన వెంటనే రాష్ట్ర ధార్మిక పరిషత్ ప్రతినిధి కరాటే కల్యాణి, ఇతర ప్రతినిధులకు ఫోన్‌లో సమాచారం అందజేశారు. కొద్దిసేపటికి వారంతా దాబాకు చేరుకున్నారు. కిచెన్‌లో వండిన మాంసం కూరను పరిశీలించారు. ఇది ముమ్మాటికీగో మాంసమేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నక్కపల్లి ఎస్‌ఐ సన్నిబాబుకు ఫోన్ చేసి చెప్పారు. ఆయన వచ్చి మాంసాన్ని పరిశీలించారు. సుమారు మూడు కిలోల మాంసాన్ని సీజ్ చేశారు. శనివారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వచ్చి పరిశీలించిన తరువాత గో మాంసమేనని తేలితే చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ చెప్పారు.