పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. అలాంటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లకి తినిపించే ఆహారం, వేసే బట్టలు, స్నానం ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. ఇక, చిన్న పిల్లలకు స్నానం చేయించడం చాలా ముఖ్యం. స్నానం చేయించడం వల్ల వారికి హాయి అనిపిస్తుంది. రాత్రి వేళల్లో బాగా నిద్రపోతారు. బ్యాక్టీరియా, వైరస్ వంటివి పిల్లల దరిచేరవు. అయితే, పిల్లలకు స్నానం చేయించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు కొన్ని తప్పులు చేయడం వల్ల పిల్లలకు హాని జరుగుతుంది. వారిని ప్రమాదంలో కూడా పడేయవచ్చు. అందుకే పిల్లలకు స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పిల్లలకు స్నానం చేయించేటప్పుడు చేయకూడని తప్పులేంటో ఇక్కడ చుద్దాం.
పిల్లల్ని ఒంటరిగా వదలకండి..
స్నానం సమయంలో చాలా మంది పిల్లల్ని ఒంటరిగా వదులుతారు. అయితే, ఇలా చేయడం చాలా తప్పు అంటున్నారు నిపుణులు. ఇది పిల్లల్ని ప్రమాదమంలో పడేసే అవకాశం ఉంది. పిల్లలు నీటిలో తల పెట్టవచ్చు.. లేదా నీటిలో మునిగిపోవచ్చు.. లేదా జారి పడిపోవచ్చు. అందుకే పిల్లల స్నానం సమయంలో పెద్దవారు పక్కనే ఉండాలి. దగ్గరుండి.. మరీ పిల్లలకు స్నానం చేయిస్తేనే పై చెప్పిన ప్రమాదాలని నివారించవచ్చు. చిన్న నిర్లక్ష్యం కూడా పిల్లల్ని ప్రమాదంలో పడేసే ఛాన్స్ ఉంది.
నీటి ఉష్ణోగ్రత..
పిల్లలకు స్నానం చేయించే నీరు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నీటి ఉష్ణోగ్రత విషయంలో. స్నానం చేయించే వాటర్ చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండకూడదు. ఇలా ఉంటే పిల్లల చర్మానికి హాని కలిగే అవకాశం ఉంది. అందుకే గోరు వెచ్చని నీటితో పిల్లలకు స్నానం చేయించాలి. అంతేకాకుండా పిల్లల తలపై డైరెక్ట్‌గా వేడి లేదా చల్లని నీళ్లు పోయడం ప్రమాదకరం. ఆ నీళ్లు కళ్లు, ముక్కుల్లోకి పోయి వారికి ఊపిరాడకపోవచ్చు. అందుకే ఈ తప్పును ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి.
సబ్బు లేదా షాంపూ వాడేటప్పుడు జాగ్రత్త..
చాలా మంది పిల్లలకు స్నానం చేయించేటప్పుడు సబ్బు లేదా షాంపూ వాడుతుంటారు. అయితే, సబ్బు లేదా షాంపూ పిల్లల కళ్లు లేదా ముక్కులోకి పోకుండా చూడకండి. ఇది పిల్లలకి నొప్పి, అసౌకర్యం కలిగించవచ్చు. షాంపూ లేదా సబ్బు కొన్నిసార్లు కళ్లకు చికాకు కలిగించవచ్చు. పిల్లల కళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. దీంతో.. వారి కళ్లకు హాని జరిగే ప్రమాదముంది. అందుకే ఈ తప్పును నివారించాలి.
ఎలా పడితే అలా స్నానం వద్దు..
స్నానం చేయించేటప్పుడు పిల్లల పొజిషన్ కూడా చాలా ముఖ్యం. పిల్లల్ని సరైన స్థితిలో ఉంచి స్నానం చేయించాలి. దీంతో పిల్లలు సురక్షితంగా, సుఖంగా ఉంటారు. ఇందుకోసం.. పిల్లల్ని కాళ్లపై కూర్చోబెట్టుకుని స్నానం చేయించండి. ముఖ్యంగా నెలల పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నెలల పిల్లలు అయితే కాళ్ల మీద పడుకోబెట్టుకుని స్నానం చేయించండి. పిల్లల్ని రాంగ్ పొజిషన్‌లో కూర్చోబెట్టి స్నానం చేయిస్తే వారికి హాని జరిగే అవకాశం ఉంది.
స్నానం చేసిన వెంటనే ఈ జాగ్రత్తలు ముఖ్యం..
స్నానం చేయించేటప్పుడు మాత్రమే కాకుండా స్నానం చేసిన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్నానం చేసిన వెంటనే పిల్లల్ని తడిగా ఉంచవద్దు. వారిని ఎండలో కాసేపు ఉంచండి. ఆ తర్వాత వెంటనే మెత్తని తువాలుతో తేమను తుడిచివేయండి. పిల్లల అన్ని భాగాల్లో తేమ ఉండకుండా చూసుకోండి. తడి లేదా తేమ ఉంటే పిల్లలకు అలర్జీ సమస్యలు రావచ్చు. చలికాలంలో పిల్లలకు స్నానం చేయించిన వెంటనే పొడి గుడ్డతో తుడవండి. లేదంటే పిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.