ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ నోట అక్కినేని మాట.. తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారని ప్రశంసలు

national |  Suryaa Desk  | Published : Sun, Dec 29, 2024, 08:12 PM

ప్రతీ నెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 117వ ఎపిసోడ్ విడుదల అయింది. అయితే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా తన మనసులో ఉన్న విషయాలను.. దేశ ప్రజలతో ప్రధాని మోదీ పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి టాలీవుడ్ అగ్ర హీరో, దివంగత అక్కినేని నాగేశ్వరరావు, బాలీవుడ్ డైరెక్టర్ తపన్ సిన్హా, రాజ్ కపూర్ వంటి ప్రముఖులను.. వారు చేసిన సేవలను మన్ కీ బాత్‌లో దేశ ప్రజలకు చెప్పారు. అదే సమయంలో ఈ సందర్భంగా రాజ్యాంగం గురించి ప్రస్తావించారు. ఇక వచ్చే నెలలో జరగనున్న మహా కుంభమేళా గురించిన విషయాలను ప్రధాని మోదీ పంచుకున్నారు.


మన్‌ కీ బాత్‌ 117వ ఎసిపోడ్‌లో భాగంగా అక్కినేని నాగేశ్వరరావు గురించి.. ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక విషయాలు పంచుకున్నారు. తెలుగు సినిమా స్థాయిని అక్కినేని నాగేశ్వరరావు మరోస్థాయికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను తెరపై కళ్లకు కట్టినట్లు చూపించేవారని గుర్తు చేశారు. అదే సమయంలో బాలీవుడ్‌ డైరెక్టర్ తపన్ సిన్హా సినిమాలు సమాజానికి సరికొత్త మార్గం చూపించాయని పేర్కొన్నారు. ఇక రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా దేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి చూపించారని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.


ఇదే సమయంలో ప్రపంచ దేశాలు మొత్తం ప్రస్తుతం భారతీయ చలనచిత్ర రంగం వైపు చూస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. తొలిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సులో మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు చెందిన ప్రపంచ దేశాల ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు.


మన్ కీ బాత్ కార్యక్రమంలోనే మహా కుంభమేళా గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. జనవరి 13వ తేదీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభ మేళాను ఐక్యతా మేళాగా ప్రధాని మోదీ అభివర్ణించారు. దీనికి సంబంధించి టూర్ ప్యాకేజీలు, వసతి సహా సమస్త సమాచారాన్ని భక్తులు తెలుసుకునేందుకు ఏఐ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ ఏఐ చాట్‌బాట్ 11 భాషల్లో ఉంటుందని చెప్పారు. అందులో ఉన్న డిజిటల్ నావిగేషన్ సహాయంతో భక్తులు కుంభమేళాలోని వివిధ ఘాట్‌లు, దేవాలయాలు, సాధువుల శిబిరాలను సందర్శించవచ్చని పేర్కొన్నారు. ఇక కుంభమేళాలో తప్పిపోయిన వారిని గుర్తించేందుకు ఏఐ కెమెరాలు, డిజిటల్ లాస్ట్ అండ్‌ ఫౌండ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుంభమేళాలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోబోటిక్‌ ఫైర్‌ టెండర్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.


ఇక భారత రాజ్యాంగ విలువల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ.. భారతీయులందరికీ రాజ్యాంగం ఒక మార్గనిర్దేశకమని తెలిపారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. రాజ్యాంగంపై ప్రజలు తమ అభిప్రాయాలను వీడియోలుగా రూపొందించి.. ఆ వెబ్‌సైట్‌లో ఉంచాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా అందులో దేశ ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. ఈ వెబ్‌సైట్‌లో దేశంలోని చాలా భాషల్లో రాజ్యాంగాన్ని అనువదించినట్లు వెల్లడించారు. దేశంలోని అన్ని భాషల వారు రాజ్యాంగ పీఠికను చదివి.. అర్థం కాని వాటిపై ప్రశ్నలు కూడా అడగవచ్చని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com