ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొదటి రోజే ఒక్కో షేరుపై రూ.200 లాభం.. 53 శాతం ప్రీమియంతో లిస్టైన స్టాక్

business |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2024, 11:08 PM

ఫార్మా సెక్టార్‌కి చెందిన ప్రముఖ కంపెనీ సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ కంపెనీ షేర్లు ఐపీఓ ప్రైస్‌తో పోలిస్తే ఏకంగా 53 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. సెనోర్స్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ ధర రూ.391గా ఉండగా సోమవారం రోజున నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో 53 శాతం ప్రీమియంతో రూ.600 వద్ద స్టాక్ లిస్టయ్యింది. ఇక బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో 51.8 శాతం లాభంతో రూ.593.7 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టింది. దీంతో లిస్టింగ్‌తోనే ఒక్కో షేరుపై రూ.200పైన లాభం వచ్చినట్లయింది.


ఈ పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్ షేరు ధర స్ట్రాంగ్ లిస్టింగ్ అవుతుందని అంచనా వేశారు. అనుకున్నట్లుగానే మంచి లిస్టింగ్ గేయిన్స్‌ అందించింది. సెనోర్స్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 20, 2024న మొదలై డిసెంబర్ 24, 2024 తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. గడువు ముగుసే నాటికి సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ మొత్తంగా 97.86 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. రిటైల్ కేటగిరీలో 93.16 రెట్లు, క్యూఐబీ కేటగిరీలో 97.84 రెట్లు, ఎన్ఐఐ కేటగిరిలో 100.35 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.


ఇక సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం లేదా జీఎంపీ అనేది 284గా ఉంది. అంటే గ్రేమార్కెట్లో ఈ కంపెనీ షేర్లు ఇష్యూ ధర కన్నా రూ. 284 పైన ట్రేడింగ్ అయ్యాయి. దీంతో మార్కెట్లలో రూ. 675 పైన లిస్టవుతుందని అంతా అంచనా వేశారు. 72.63 శాతం ప్రీమియంతో ఎంట్రీ ఇస్తాయని భావించారు. కాస్త తగ్గినా భారీ లాభాలతోనే మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చిందని చెప్పవచ్చు. సెనోర్స్ ఫార్మా ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 372 నుంచి రూ. 391గా కంపెనీ నిర్ణయించింది. సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీని 2017, డిసెంబర్‌లో ఏర్పాటు చేశారు. ప్రధానంగా అమెరికా, కెనాడా, యూకే వంటి దేశాలకు ఫార్మా ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. అలాగే అభివృద్ధి చెందుతున్న పలు దేశాలకు సైతం తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com