ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీనేజ్ పిల్లల ముందు ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి

Life style |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2024, 11:10 PM

ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు సవాల్‌గా ఉంటుంది. అయితే.. టీనేజ్ పిల్లల్ని పెంచడం మరో ఎత్తు అని చెప్పాలి. పిల్లలు యుక్తవయసుకు వచ్చినప్పుడు.. చాలా గందరగోళంగా ఉంటారు. శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు కోపం, చిరాకు కలిగిస్తాయి. తనలో ఒక్కసారిగా మార్పులు ఎందుకు మొదలయ్యాయో అర్థం కాదు. పిల్లలు పెరిగే కొద్దీ ప్రశ్నలు కూడా పెరుగుతాయి. పిల్లలు ఈ వయసులో చాలా ఉత్సాహంగా ఉంటారు. టీనేజ్ పిల్లల్ని తల్లిదండ్రులు చాలా జాగ్రతగా చూసుకోవాలి.


అలాగే, టీనేజ్ వయసుకు వచ్చిన పిల్లల ముందు తల్లిదండ్రులు కొన్ని అలవాట్లు మానుకోవాలి. ఈ వయసులోని పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉంటారు. తల్లిదండ్రులు చేసే తప్పుల్ని ఇట్టే గ్రహిస్తారు. తల్లిదండ్రుల చెడు అలవాట్లు లేదా తప్పుడు ప్రవర్తన పిల్లల మెదడును ప్రభావితం చేసే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ప్రవర్తన, అలవాట్లు నచ్చకపోతే వారిని గౌరవించరు. ఇంతకు ముందు చూపిన గౌరవ భావం కచ్చితంగా తగ్గుతుంది. ఈ అలవాట్లు వెంటనే మానేయకపోతే.. వృద్ధాప్య సమయంలో వారి మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. ఆ అలవాట్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.


తప్పులు ఒప్పుకోకపోవడం..


చాలా మంది తల్లిదండ్రులు తెలియకో, తెలిసో పిల్లల విషయంలో తప్పులు చేస్తుంటారు. టీనేజ్ పిల్లలు తప్పుల విషయంలో క్లారిటీగా ఉంటారు. అయితే, ఈ తప్పులు పిల్లలు ఎత్తిచూపినప్పుడు వారితో వాదనకు దిగుతారు. తల్లిదండ్రులు తమ తప్పుల్ని అంగీకరించడానికి నిరాకరిస్తారు. తల్లిదండ్రుల ఈ అలవాటు పిల్లలకు చెడుగా అనిపిస్తుంది. కాలం మారే కొద్దీ.. ఈ అలవాట్లు పట్లు వారు విసుగు చెందుతారు. దీంతో.. తల్లిదండ్రులపై గౌరవం కోల్పోయే ప్రమాదముంది. అందుకే పిల్లల విషయంలో చేసే తప్పుల్ని వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.


పిల్లల మాట వినకపోవడం..


చిన్న వయసులోతల్లిదండ్రులు పిల్లలకు చాలా సలహాలు ఇవ్వాలి. సరైన మార్గంలో నడిపించాలి. అదే టీనేజ్ వయసులో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. టీనేజ్ వయసులో పిల్లలకు కొన్ని అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. వారు ఆ ఆలోచనలు, బాధల్ని తల్లిదండ్రులతో పంచుకోవాలని కోరుకుంటారు. అయితే, తల్లిదండ్రుల మాత్రం టీనేజ్ పిల్లల అభిప్రాయాల్ని గౌరవించరు. వారి ఆలోచనల్ని పట్టించుకోరు. తమ మాటే నెగ్గాలని భావిస్తారు. తమ ఆలోచనలు, మాటల్ని పట్టించుకోనప్పుడు పిల్లలకు తల్లిదండ్రులపై గౌరవం కోల్పోయే ప్రమాదముంది. దీంతో.. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంది.


ప్రతిదానికీ అరవడం..


టీనేజ్ పిల్లలు కొంచెం అగ్రెసివ్‌గా ఉంటారు. దీంతో.. దూకుడుతో కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాంటి సమయంలో పిల్లలపై తల్లిదండ్రులు కోప్పడుతుంటారు. చేసే చిన్న చిన్న తప్పులకు కూడా వారిపై అరుస్తుంటారు. దీనివల్ల పిల్లల మనసుల్లో తల్లిదండ్రుల పట్ల భయం మొదలవుతుంది. రోజూ అరుస్తుంటే పిల్లలు తమ తల్లిదండ్రులపై నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రమాదముంది. ఇలాంటి ఆలోచన వారి మైండ్‌లో క్రియేట్ అయితే.. తల్లిదండ్రులపై గౌరవం కోల్పోయే అవకాశం ఉంది. వృద్దాప్యంలో మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. పిల్లలపై అరిచే బదులు.. వారి తప్పులు అర్థమయ్యేలా ప్రశాంతంగా చెప్పే ప్రయత్నం చేయండి.


అబద్ధం చెప్పే అలవాటు..


చిన్నతనంలో చెప్పే తల్లిదండ్రులు చెప్పే అబద్ధాల్ని పిల్లలు అంతగా పట్టించుకోకపోవచ్చు. అదే పిల్లలు పెరిగే కొద్ది.. వారికి ఓ అవగాహన వస్తుంది. పిల్లలు పెరిగేటప్పుడు కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకు అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. వారు ఏదైనా అడిగినప్పుడు.. మీకు వీలైతేనే అది జరుగుతుంది అని చెప్పండి. ఆ టైంకి తప్పించుకోవడానికి ఓకే అని చెప్పి తర్వాత చేయకపోతే వారు చాలా బాధపడతారు. మాటిమాటీకి ఇలానే జరుగుతుంటే.. వారి మిమ్మల్ని అబద్ధాల కోరుగా చూసే ప్రమాదముంది. దీంతో.. మీపై గౌరవ భావాన్ని కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు.


డబ్బును వృధా చేసే అలవాటు..


డబ్బును ఎలా నిర్వహించాలో చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. ఎలా పడితే అలా ఖర్చు పెడుతూ పోతుంటే టీనేజ్ పిల్లలు దానిని ఇష్టపడరు. తమ చదువులు, పెళ్లిపై వాళ్లు చాలా ఆశలు పెట్టుకుంటారు. అయితే, తల్లిదండ్రులు వృధాగా ఖర్చు చేస్తే మాత్రం కచ్చితంగా పిల్లలు వారిని గౌరవించడం మానేస్తారు. ఉదహరణకు తల్లి లేదా తండ్రికి చెడు అలవాట్లు ఉండి.. వాటి కోసం డబ్బు తెగ ఖర్చు చేస్తే.. అది వారి మనస్సుల్లో నాటుకుపోతుంది. దీంతో.. మీపై కచ్చితంగా గౌరవాన్ని కోల్పోతారు. అందుకే ఈ అలవాటును తల్లిదండ్రులు వెంటనే మానేయాలి.


తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..


* టీనేజ్ పిల్లల పెంపకం అంత ఈజీ కాదు. ఈ వయసులో వారిలో చాలా మార్పులు వస్తుంటాయి. ​తల్లిదండ్రులు తమ పిల్లలను గౌరవించడం కూడా చాలా ముఖ్యం. పిల్లలకు సొంత వ్యక్తిత్వం ఉంటుంది. టీనేజ్ పిల్లలకు కూడా కొన్ని ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. అందుకే వారు చెప్పే ప్రతిదాన్ని ప్రశాంతంగా వినండి.


* ఈ వయసులో టీనేజ్ పిల్లలు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు . అయితే వారిని ఒంటరిగా వదిలిపెట్టకూడదు. వారిని ఏదో ఒక పనిలో బిజీగా ఉంచండి. ఇంటి పనులు చేయించడం.. బయటి నుంచి ఏదైనా వస్తువు తీసుకురమ్మనడం లాంటి పనులు చేయించండి.


* ప్రతి పిల్లల్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. తల్లిదండ్రులు దాన్ని బయటకు తీసి సానబెట్టాలి. పిల్లలకు ఎందులో టాలెంట్ ఉందో అందులో ముందుకు సాగేలా ప్రోత్సహించండి. వారికి ఎలాంటి నైపుణ్యాలు లేకపోయినా చింతించకండి. వారికి నచ్చిన విధంగా నైపుణ్యాలను నేర్పించండి. సంగీతం, నృత్యం, పెయింటింగ్, స్విమ్మింగ్, క్రీడలు ఏదైనా సరే ఎంకరేజ్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com