ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జుట్టు విపరీతంగా రాలిపోతుందా? తమలపాకుల్ని ఇలా వాడితే

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2024, 11:15 PM

దుమ్ము, కాలుష్యం కారణంగా మన జుట్టు పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అంతేకాకుండా.. తెల్ల జుట్టు, తలపై వెంట్రుకలు రాలిపోవడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉరుకుల పరుగుల జీవితం, పొల్యూషన్, మనం తినే ఆహారం కారణగా చిన్న వయసులోనే చాలా మంది జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఖరీదైన షాంపూలు, కండిషనర్లు సీరమ్‌లు వాడుతుంటాం. చలికాలంలో జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది. మనం జుట్టు రాలిపోకుండా ఉండటం కోసం చాలా ఖర్చు చేస్తూంటాం. అయితే, మనం తీసుకునే చికిత్సలు చాలా కాలం తర్వాత జుట్టును పాడు చేస్తాయి. అంతేకాకుండా మీ జేబుకు చిల్లులు పడేలా చేస్తుంది.


అయితే, ఎటువంటి ఖర్చు లేకుండా.. కొన్ని సహజ పద్ధతుల ద్వారా జుట్టును సంరక్షించుకోవచ్చు. కొన్ని ఇంటి చిట్కాలు.. జుట్టును పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని పోషకాలు అవసరం. పోషకాలు.. జుట్టుకు కావాల్సిన పోషణను అందిస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలిపోకుండా కంట్రోల్ చేస్తాయి. అయితే, జుట్టు రాలడాన్ని అరికట్టడంలో, ఇతర హెయిర్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేయడంలో తమలపాకుల వాడకం ఎంతో మేలు చేస్తుంది. తమలపాకుల్ని జుట్టు ఆరోగ్యానికి ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.


తమలపాకులతో ప్రయోజనాలు..


ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తమలపాకులు జుట్టు ఆరోగ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. తమలపాకుల్లో విటమిన్ ఎ, సి, బి1, బి2, పొటాషియం, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు తమలపాకుల్లో లభిస్తాయి. ఈ పోషకాలన్నీ బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. తమలపాకుల్ని ఉపయోగించడం ద్వారా తలలో దురద, తెల్ల జుట్టు సమస్య కూడా నయమవుతుంది. తమలపాకులో ఉండే విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు, జుట్టు చిట్లడం, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. జుట్టు రాలడం తగ్గి.. పెరగాలంటే తమలపాకుల్ని ఎలా వాడాలో చుద్దాం.


తమలపాకుల నీరు..


తమలపాకుల నీరు.. జుట్టు సమస్యల్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం 15 నుంచి 20 తమలపాకుల్ని ఒక పాత్రలో వేసి మరిగించాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి.. చల్లబర్చండి. ఆ తర్వాత ఆ నీటితో జుట్టును వాష్ చేసుకోండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. తమలపాకుల నీరు వల్ల జుట్టుకు తగిన పోషణ అందుతుంది. తమలపాకుల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది స్కాల్ప్ ఇన్ఫెక్షన్ సమస్యను దూరం చేయడంతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.


తమలపాకుల్ని తినడం..


జుట్టు రాలే సమస్యను తగ్గించడం కోసం తమలపాకుల్ని డైరెక్ట్‌గా తినవచ్చు. ఇందుకోసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో 5-6 తమలపాకుల్ని నమలండి. లేదంటే తమలపాకుల నీరు కూడా తాగవచ్చు. ఇందుకోసం 10 నుంచి 15 తమలపాకుల్ని మరిగించి.. ఆ నీటిని తీసుకోవచ్చు. ఇలా తాగడం వల్ల జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.


తమలపాకులు, నెయ్యితో హెయిర్ మాస్క్..


తమలపాకులు, నెయ్యి హెయిర్ మాస్క్ కూడా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ జుట్టును ఒత్తుగా మారుస్తుంది. ఇందుకోసం ముందుగా 15 నుంచి 20 తమలపాకుల్ని తీసుకోండి. ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి కాస్త నీరు కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ తర్వాత ఈ పేస్టులో ఒక చెంచా నెయ్యి కలపండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయండి. ఆ తర్వాత గంట పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలుంటాయి.


తమలపాకులతో చేసిన నూనె..


తమలపాకుల నూనె జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇందుకోసం కొబ్బరి నూనె లేదా ఆవాల నూనెను తీసుకోండి. ఈ నూనెను తక్కువ మంటపై మరిగించండి. ఆ తర్వాత 10 నుంచి 15 తమలపాకుల్ని ఆ నూనెలో వేయండి. కాసేపు అలానే మరిగించండి. తమలపాకులు నల్లగా మారినప్పుడు.. నూనె మరిగించడం ఆపండి. ఆ తర్వాత నూనెను చల్లార్చి.. ఫిల్టర్ చేసి ఓ బాటిల్‌లో తీసుకోండి. ఈ నూనెను జుట్టు మొత్తం అప్లై అయ్యేలా రాయండి. ఓ రాత్రంతా అలాగే ఉంచండి. లేదంటే ఒక గంట అలానే ఉంచి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ నూనె రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గి.. ఒత్తుగా పెరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com