మాజీ మంత్రి పేర్నినానికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్ట్‌లో ఈరోజు (మంగళవారం) విచారణ జరిగింది. సోమవారం (జనవరి6) వరకు ఎటువంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాఫీ కేసులో పేర్నినానిని పోలీసులు 6 వ నిందితుడిగా చేర్చారు. కాగా.. మచిలీపట్నం రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పేర్నినానిని ఏ 6గా చేర్చుతూ కృష్ణా జిల్లా బందరు తాలుక పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయ్యింది. దీంతో ఏక్షణమైనా మాజీ మంత్రి అరెస్ట్ ఖాయం అనే వార్తలు వచ్చాయి. దీంతో పేర్నినాని పరారీలో ఉన్నట్లు తెలిసింది. అయితే అనూహ్యంగా పేర్నినాని హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు ఉదయం హైకోర్టులో పేర్నినాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.