విజయనగరం జిల్లా. మెంటాడ మండలంలోని బుచ్చి రాజుపేట, గురమ్మవలస గ్రామాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. విజయనగరం నుంచి జక్కువ వెళ్తున్న బస్సులో సాంకేతిక సమస్య తలెత్తి గురమ్మవలస సమీపంలోని మలుపు వద్ద పొలాల్లో బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ఆరుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. వీరంతా జక్కువ గ్రామానికి చెందిన వారు కాగా, వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇంకో పది నిమిషాల్లో గ్రామానికి చేరుకుంటున్న సమయంలో పంటపొలాల్లో బస్ బోల్తా పడింది. బస్సు ప్రమాద ఘటనలో మహిళా కండ క్టర్ సుజాత షాక్‌కు గురయ్యారు. ఆమె కాలికి స్వల్ప గాయమైంది. మలుపులు అధికంగా ఉన్న ఈ రూట్‌లో డ్రైవర్ భాస్కరరావుకు డ్యూటీ ఇదే తొలిసారని సమాచారం. ఘటనా స్థలానికి ఆండ్ర ఎస్‌ఐ సీతారాం చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.