ఈ ప్రపంచంలో నిత్యం అనేక ఘటనలు జరుగుతుంటాయి. కొన్ని ఘటనలు చూడటానికి సాధారణంగా కనిపిస్తే.. మరికొన్ని కర్మ సిద్ధాంతాన్ని గుర్తుకు తెస్తాయి. మరీ ముఖ్యంగా మరణం విషయంలో. మృత్యుదేవత అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందనేదీ ఎవరి ఊహకు అందనిది. ఈ భూమ్మీద మనకు నూకలు చెల్లిపోతే హైసెక్యూరిటీ జోన్‌లో ఉన్న కూడా.. గుండుసూది కూడా మన ప్రాణం తీస్తుంది. మనకంటూ ఇంకాస్త టైమ్ ఉంటే.. రైలు మీద నుంచి వెళ్లినా కూడా బతికి బట్టకడతాం. ఈ విషయాన్ని రుజువు చేసే ఎన్నో ఘటనలు మనకు చిరపరిచితమే. అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రామలింగాయపల్లి గ్రామం. మాధవయ్య, అనంతమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు. వారికి ఓ కుమార్తె, ఇద్దరు కొడుకులు. సాఫీగా జీవనం సాగిపోతోంది. మాధవయ్య వృత్తిరీత్యా రైతు. భూమి మీద మమకారంతో కంది పంట వేశాడు. వారి ఆశల్లాగే పంట ఏపుగా పెరిగింది. కోత సమయం వచ్చింది. మాధవయ్య పొలంలో పంటకోత పనులు మొదలెట్టాడు. అయితే ఈ పనులే తమ కుటుంబంలో పెను విషాదాన్ని నింపుతాయని ఆ కుటుంబం ఊహించలేకపోయింది. అప్పటి వరకూ సంతోషంగా సాగిన తమ జీవితం తల్లకిందులౌతుందని అంచనా వేయలేకపోయింది.
శుక్రవారం రోజున మాధవయ్య, భార్య అనంతమ్మతో కలిసి పొలంలో కంది పంట కోత పనులు చేపట్టారు. ఈ సమయంలో వారెవరూ ఊహించని పెను విషాదం చోటుచేసుకుంది. అనంతమ్మ యంత్రం వద్ద పనిచేస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తు అనంతమ్మ తలకు చుట్టుకున్న చీరకొంగు యంత్రం చక్రం పట్టకు తగులుకుంది. యంత్రం పనిచేస్తుండటంతో అంతే వేగంగా ఆమె మెడకు చీరకొంగు బిగుసుకుంది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనకు అక్కడున్న వారందరూ ఉలిక్కిపడ్డారు. యంత్రాన్ని ఆఫ్ చేసి అనంతమ్మను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చీరకొంగు గొంతుకు బిగుసుకుని అనంతమ్మ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది.
ఊహించని ఈ ప్రమాదంతో మాధవయ్య కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకొన్న జొన్నగిరి ఎస్సై జయశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ మొదలెట్టారు. అలా మానం కాపాడే చీర కొంగే ఆ మహిళ ప్రాణం తీసి.. ఆ కుటుంబంలో అంతులేని వేదనను మిగిల్చింది.