నేపాల్-టిబెట్ సరిహద్దులను భూకంపం వణికించింది. మంగళవారం ఉదయం ఇక్కడ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విపత్తు కారణంగా టిబెట్ రీజియన్‌లో ఇప్పటి వరకు కనీసం 9 మంది మృతిచెందినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.35 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టిబెట్‌లోని షిజాంగ్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. దీని తీవ్రతతో నేపాల్ రాజధాని కాఠ్మాండూ సహా పలు జిల్లాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రకంపనల ధాటికి ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.ఈ ప్రకంపనల ప్రభావం భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. దిల్లీ-ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, బిహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. అటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. చైనాలో భూకంప తీవ్రత 6.8గా నమోదైంది.