రేపు అనగా ఈ నెల 8న విశాఖలో ప్రధాని పర్యటన నేపథ్యంలో మంత్రులు, కూటమి నేతలు నగరానికి చేరుకుంటున్నారు. మంత్రి లోకేశ్ ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయగా సోమవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, ఇతర ప్రముఖులు సమావేశమయ్యారు. జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహార్ అనకాపల్లిలో సమీక్ష నిర్వహించిన అనంతరం నగరానికి చేరుకుని కేడర్‌తో సమావేశమై జన సమీకరణపై సమీక్షించారు. ప్రధాని సభకు మూడు లక్షల మందిని సమీకరించాలని లోకేశ్ ఆదేశించడంతో అందుకు తగినట్టుగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సిద్ధమవుతున్నారు. బహిరంగ సభలో రెండు లక్షలు, రోడ్‌షోలో మరో లక్ష మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజక వర్గాల వారీగా జన సమీకరణపై దృష్టిసారించారు. జనాలను తరలించేందుకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, వ్యాన్‌లు, కార్లు కలిసి సుమారు ఏడు వేల వాహనాలు వినియోగించనున్నారు. సభకు వచ్చే జనం కోసం మూడు లక్షల ఫుడ్‌ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల నుంచి బహిరంగ సభకు వచ్చే వారి కోసం 1.1 లక్షల ప్యాకెట్లు బస్సులు/వాహనాలు బయలుదేరే పాయింట్లకు పంపుతారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే వారికి నాతవలస టోల్‌గేట్ వద్ద 15 వేల ప్యాకెట్లు అందిస్తారు. అనకాపల్లి నుంచి వచ్చే వారికి 40 వేలు, విజయనగరం జిల్లా నుంచి వచ్చే వారికి 15 వేల ప్యాకెట్లు ఆయా జిల్లాల అధికారులు బస్సుల్లోనే అందించనున్నారు. సభ అనంతరం తిరిగి వెళ్లేప్పుడు పంపిణీ చేసే నిమిత్తం విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారికి 1.25 లక్షలు, విజయనగరం, అనకాపల్లి నుంచి వారికి 55 వేల ఆహార ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. ఇవి కాకుండా ప్రత్యామ్నాయంగా అనకాపల్లి నుంచి వచ్చే వారికి అగనంపూడి టోల్‌గేటు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చే వారికి రాజాపులోవ సమీపాన అవంతి కళాశాల, అడవివరం జంక్షన్ వద్ద అందించేందుకు 20 వేల స్నాక్స్ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. కాగా రోడ్ షోలో పాల్గొనే 70 వేల మందికి స్నాక్స్ పంపిణీ చేయాలని భావించారు. అయితే ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ అధికారులు అనుమతి ఇవ్వనందున వాటి పంపిణీ రద్దు చేశారు.