రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటన విజయవంతమైంది. పర్యటన ఆద్యంతం సందడిగా రాజకీయాలకతీతంగా మంత్రి పర్యటన సాగింది. తొలుత ఉండి జడ్పీ హైస్కూల్‌లో పునఃనిర్మించిన భవనాన్ని ప్రారంభించి చిన్నారులతో ముచ్చటించారు. విద్యార్థుల హాజరు తక్కువగా ఉండడంపై ఉపాధ్యాయులతో ప్రస్తావించారు. మంచినీటి సౌకర్యం లేక పిల్లలు అనారోగ్యం బారినపడి పాఠశాలకు రావడం లేదంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారు. ఉపాధ్యాయులు ఏ విధంగా చెబుతున్నారు తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు. అందుకు తగిన విధంగా చదువుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా వుండాలని అవి ఎంతో ప్రమాదకరమన్నారు. పాఠశాల ఆవరణలో రూ.18 లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని ప్రారంభించారు. సెటిల్ కోర్టులను, పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. స్థానిక మహిళలు లోకేశ్‌ను చూస్తూ కేకలు వేయడంతో పాఠశాల గోడ వద్దకు వచ్చి వారి నుంచి వినతి పత్రం తీసుకున్నారు. ‘కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేరుస్తోంది. పెన్షన్ పెంచాం. ఉచిత సిలిండర్‌లు అందజేస్తున్నాం. త్వరలో తల్లికి వందనం ఇస్తామ’ంటూ వారికి భరోసా ఇచ్చారు.