అక్కా, చెల్లెలు కూతుళ్లతో పాటు అన్నా, తమ్ముడి బిడ్డలను కూడా చాలా మంది సొంత పిల్లల్లాగే భావిస్తుంటారు. వాళ్లు తమకు నచ్చని ఏ పని చేసిన సహించరు. అలాగే చేశాడో వ్యక్తి. మేనకోడలు తనకు నచ్చని వాడిని పెళ్లి చేసుకోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు. ఈక్రమంలోనే ఆమెపై విపరీతమైన కోపం పెంచుకున్న అతడు.. నేరుగా దాన్ని ఆమె మీద చూపించకుండా బంధువులపై చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఆమె వివాహ విందు భోజనంలో విషం కలిపి వందలాది మంది ప్రాణాలు తీసే ప్రయత్నం చేశాడు. కానీ అదృష్టవశాత్తు అందరూ ఆ ఆహారాన్ని తినకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా ఉట్రే గ్రామానికి చెందిన మహేష్ పాటిల్‌కు చిన్నప్పటి నుంచి తన అక్క కూతురు అంటే చాలా ఇష్టం. తన ఇంట్లనే ఉంచుకుంటూ మరీ ఆమెను చదివిస్తున్నాడు. అంతేనా చాలా ప్రేమ కూడా పంచుతున్నాడు. అయితే బాగా చదువుకుని మామయ్యకు మంచి పేరు తేవాల్సిన ఆ యువతి మాత్రం అదే గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో ప్రేమాయణం నడిపింది. అది తెలిస్తే మామయ్య ఊరుకోడని భావించి... ఇటీవలే అతడితో పారిపోయి మరీ పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అబ్బాయి తరఫు వాళ్లు పెళ్లి ఎలాగూ జరిగిపోయింది కదా అని రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న యువతి మేనమామ మహేష్ పాటిల్.. ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈక్రమంలోనే వివాహ విందును అడ్డుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా.. బుధవారం రోజు గ్రామంలో జరుగుతున్న మేనకోడలి వివాహ విందుకు వెళ్లాడు. అక్కడే వంటలు చేస్తున్న గదిలోకి ప్రవేశించి.. విషం కలిపాడు. అక్కడున్న ఆహార పదార్థాలన్నీ కలిపి పెడుతుండగా ఓ వ్యక్తి గమనించాడు. అనుమానం వచ్చి ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు. కానీ అంతలోనే మహేష్ పాటిల్ అక్కడ నుంచి తప్పించుకుని పోయాడు.
అయితే అక్కడే ఉన్న విషం బాటిల్‌ను చూసిన సదరు వ్యక్తి.. బంధువులు, గ్రామస్థులకు విషయం చెప్పాడు. ఇలా భోజనం ఎవరూ తినొద్దని అందరికీ వివరించాడు. అనంతరం అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆహారాన్ని ల్యాబ్‌కు పంపి మరీ అందులో విషం ఉందా లేదా అని తెలుసుకుంటున్నారు. అయితే నిజంగానే అతడు భోజనంలో విషం కలిపి ఉంటే సెక్షన్ 286, సెక్షన్ 125 కింద కేసులు పెడతామని పన్హాలా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ మహేష్ కొండుభైరి తెలిపారు.
ఏది ఏమైనా మేనకోడలిపై కోపంతో వందలాది మందిని చంపాలని చూసిన మేహష్ పాటిల్‌ను అస్సలే వదలొద్దని గ్రామస్థులతో పాటు బంధువులు పోలీసులకు చెబుతున్నారు. తమలో ఒకరు చూడడం వల్లే ఈరోజు పెద్ద ప్రమాదం తప్పిందని.. లేదంటే వందల మంది ప్రాణాలు కోల్పోయేవాళ్లమని చెప్పుకొచ్చారు.