దోమలతో ఎన్నో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ సహా అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందడానికి దోమలే వాహకాలుగా ఉంటాయి. అందుకే ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం, చెత్తా చెదారం పేరుకుపోయి పారిశుద్ధ్యం లేకపోవడంతో దోమలు వృద్ధి చెందుతాయి. ఇక వర్షాకాలంలో అయితే దోమల బెడద ఎక్కువగా ఉండి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అసలు దోమలను కట్టడి చేయడం వల్ల ఈ వ్యాధులను అరికట్టాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకోసం కొత్త ప్రయోగానికి సైంటిస్ట్‌లు చర్యలు చేపట్టారు.
కొన్నిసార్లు దోమలు కుట్టడం వల్ల వ్యాధులు సోకి.. అవి తీవ్రంగా మారి ప్రాణాలు పోతున్న సంఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి ఆడ దోమలే ప్రధాన కారణం. ఈ క్రమంలోనే ఆడ దోమలకు చెక్ పెట్టేలా శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగాన్ని చేపట్టారు. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమలు కుట్టడం వల్ల విజృంభిస్తోన్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల కట్టడి కోసం ఆస్ట్రేలియాలోని మాక్వేరీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సరికొత్త ప్రయోగాన్ని చేశారు. మనుషులను కుట్టి వివిధ వ్యాధులకు కారణం అయ్యే ఆడ దోమల సంఖ్యను తగ్గించేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఆడ దోమతో శృంగారం జరిపే మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని ఆస్ట్రేలియాలోని మాక్వేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మగ దోమలతో శృంగారం జరిపిన ఆడ దోమలు చనిపోవడం వల్ల వాటి సంఖ్యను తగ్గించవచ్చని తెలిపారు. ఇక మగ దోమల వీర్యం విషపూరితం కావడం వల్ల పురుగు మందుల లాగా ఇతర ప్రయోజనకర జాతులకు నష్టం జరగకుండానే దోమల బెడదను నివారించవచ్చని సైంటిస్ట్‌లు వెల్లడించారు.
ఇక ఇలాంటి ప్రయోగాలే ఈగల్లో సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. ఈగల వీర్యం విషపూరితం చేయగా.. వాటితో సంభోగం జరిపిన ఆడ ఈగల జీవితకాలం గణనీయంగా తగ్గిపోయినట్లు గుర్తించారు. అయితే ఈ ప్రయోగం వల్ల మనుషులు, ఇతర జీవులకు ఎలాంటి హానిలేదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే.. ఈ ప్రయోగాన్ని మరింత పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా ముందుకు వెళ్తామని మాక్వేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.