హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ ఐపీఓకు ఊహించని స్పందన లభించింది. ఈ ఐపీఓలో షేర్ల కోసం ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో బిడ్లు దాఖలయ్యాయి. ఇక చివరి రోజైన బుధవారం నాటికి ఏకంగా 185.48 రెట్లు ఓవర్ సబ్‌స్క్రిప్షన్స్ వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీ నుంచి ఏకంగా 327 రెట్లు ఓవర్ సబ్‌స్క్రిప్షన్స్ రావడం గమనార్హం. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో 275 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో 65.71 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి.
ఈ కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.123.02 కోట్లు సమీకరించింది. ఈ సంస్థ ఫార్మా సంస్థలకు గ్లాస్ లైనింగ్ పరికరాలు, ఇంజినీరింగ్ ఉపకరణాలు, సంక్లిష్టమైన విడిభాగాలను అందిస్తోంది. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తుందని తెలిసినప్పటికీ నుంచే వార్తల్లో నిలిచింది. ఐపీఓలో భాగంగా 2.05 కోట్ల షేర్లు జారీ చేస్తోంది. అయితే 380 కోట్ల షేర్లకు సబ్‌స్క్రిప్షన్లు వచ్చాయి. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 410 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, రూ. 53,238 కోట్లు విలువైన షేర్లకు బిడ్లు రావడం గమనార్హం.
ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 133- రూ. 140గా నిర్ణయించారు. గరిష్ఠం ధర వద్ద రూ. 410 కోట్లు సమీకరించనున్నారు. తాజా ఇష్యూ ద్వారా రూ. 210 కోట్లు విలువైన షేర్లను జారీ చేస్తుండగా.. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 1.43 కోట్ల షేర్లను విక్రయిస్తున్నారు. తాజా ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను లోన్ల చెల్లింపులు, అనుబంధ సంస్థ ఎస్2 ఇంజినీరింగ్ సంస్థలో పెట్టుబడి, వ్యూహాత్మక కొనుగోళ్లు, మెషినరీ కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.
లేటెస్ట్ జీఎంపీ ఎంత?
సాధారణంగా ఐపీఓకు వస్తున్న సంస్థ షేర్లు మార్కెట్లలో లిస్ట్ కాకముందు గ్రే మార్కెట్లో ట్రేడవుతుంటాయి. గ్రే మార్కెట్ ప్రీమియం ఆధారంగా మార్కెట్లలో ఏ స్థాయిలో లిస్టవుతాయని అంచనా వేస్తారు. స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ కంపెనీ జీఎంపీ రూ. 88గా ఉంది. అంటే ఇష్యూ ధర రూ. 140తో పోలిస్తే రూ. 88 అధికంగా లిస్టవుతాయని అంచనా. అంటే రూ. 228 వద్ద లిస్ట్ కావచ్చని భావిస్తున్నారు. ఇష్యూ ధరతో పోలిస్తే ఇది 63 శాతం ఎక్కువ అయితే, లిస్టింగ్ నాటికి ఇది మారవచ్చు.