వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్ల జారీకి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో తీవ్ర తొక్కిసలాట, ఆరుగురి దుర్మరణానికి సీఎం, టీటీడీ ఉన్నతాధికారులు, కలెక్టర్, ఎస్పీదే బాధ్యత అని వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో ప్రధాని పర్యటన పేరుతో కూటమి నాయకులు రోజంతా హడావుడి చేయడం తప్ప, ఒరిగిందేమీ లేదని చెప్పారు. ప్రధానితో శంకుస్థాపన చేయించిన వాటిలో ఒక్క ప్రాజెక్టయినా చంద్రబాబు సాధించినది ఉందా అని ప్రశ్నించారు. చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై ప్రధానితో కనీసం ప్రకటన చేయించలేకపోయారని ఆక్షేపించారు.