తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు మొదటి ముద్దాయి సీఎం చంద్రబాబేనని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. తిరుపతిలో ఈ తరహా ఘటన ఎప్పుడూ జరగలేదు. మనం చూడలేదన్నారు. ఈ ఘటన ఎందుకు జరిగిందనేది ఆలోచన చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు కనీపం రూ. 50 లక్షల ఇవ్వాలి. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారు ఇంటికి వెళ్లేటప్పుడు రూ. 5 లక్షలు ఇవ్వాలని వైయస్ జగన్ డిమాండ్ చేశారు.
గాయపడ్డ క్షతగాత్రులను తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో వైయస్ జగన్ పరామర్శించి.. అక్కడే మీడియాతో మాట్లాడుతూ..... తిరుపతిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర చరిత్రలోనే లేదు. తొక్కిసలాటకు ఇంత మంది బలి కావడం గతంలో ఎప్పుడూ చూడలేదు. కానీ, ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది.దీనికి కారణాలు చూస్తే.. ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం కొన్ని లక్షల మంది వస్తారు. ఆరోజు స్వామి వారిని దర్శిస్తే, మహా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే లక్షల మంది తరలి వస్తారు. ఆ దర్శనం కోసం టోకెన్లు ఇచ్చే కౌంటర్ల వద్ద ఎందుకు సెక్యూరిటీ కల్పించలేదు? టీటీడీ అధికారులు మొదలు జిల్లా కలెక్టర్ వరకు అందరూ దీనికి బాధ్యులు అని అన్నారు.