కాలుష్య రహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాన్ని గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం తిరుపతిలోని హోటల్ తాజ్‌లో ఏజీ అండ్ పీ ప్రథమ్-థింక్ గ్యాస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. ఇంధన రంగంలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు సంస్థల్లో ఒకటైన ఏజీ అండ్ పీ సంస్థ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తుండడాన్ని అభినందించారు. తిరుపతి నుంచి నూతన సీఎన్‌జీ, పీఎన్‌జీ ప్రాజెక్టులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యుయెల్ ఎనర్జీలో మార్పులు వస్తున్నాయని చెప్పారు. ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వాళ్లమని, ఉమ్మడి రాష్ట్రంలో 1995-96 నడుమ ఎల్పీజీ కనెక్షన్లు (దీపం) మంజూరు చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికీ దీపం-2 పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. తాజాగా స్వచ్ఛమైన, సురక్షితమైన సహజ వాయువుతో కూడిన సీఎన్‌జీని పైపులైను ద్వారా ఇంటింటికీ సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ‘2014-19 నడుమ రాష్ట్రంలో రూ.11,120 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు, 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు మా ప్రభుత్వమే భాగ్యనగర్ గ్యాస్, గోదావరి గ్యాస్, మేఘా గ్యాస్, ఐవోసీ, ఏజీ అండ్ పీ కంపెనీలకు అనుమతి ఇచ్చింది.అప్పట్లో నేను ముఖ్యమంత్రిగా నాచురల్ గ్యాస్ ట్యాక్సేషన్ 8 శాతం ప్రకటించగా.. గడచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పైగా పన్నులను 24 శాతానికి పెంచేయడంతో ఈ సంస్థలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను నిలిపివేసి పొరుగు రాష్ట్రాలకు వెళ్లాయి. ఇప్పడు మా ప్రభుత్వం ఈ పన్నులను తిరిగి 5 శాతానికి తగ్గించింది. కొన్ని నెలల కిందట శ్రీసిటీలో గ్యాస్ ఇన్‌ఫ్రా యూనిట్ ప్రారంభించాం. గత ఐదు నెలల్లో ఆ కంపెనీ 51 సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకుని వేగంగా అభివృద్ధి చెందుతోంది’ అని తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ విశాఖలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో భాగంగా ఎన్‌టీపీసీ, జెన్‌కో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును రూ.1.80 లక్షల కోట్లతో ప్రారంభించిన సంగతిని సీఎం గుర్తు చేశారు. రిలయన్స్ సంస్థ బయో ఫ్యుయెల్‌ను రూ.60 వేల కోట్ల పెట్టుబడితో 500 ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రీన్ కో ద్వారా సోలార్ విండ్, పంప్డ్ ఎనర్జీ వంటి వాటిపైన, అలాగే కాకినాడ పోర్టులో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుపైన రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఏజీ అండ్ పీ కంపెనీ రానున్న ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో పది వేల మందికి ఉపాధి అందించేందుకు కృషి చేస్తోందని, ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. తర్వాత హోటల్ తాజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం సీఎన్‌జీ ఆధారిత వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా చెత్త సేకరణ కోసం సీఎన్‌జీ వాణిజ్య వాహనాలను తిరుపతి మున్సిపల్ కమిషనర్‌కు అప్పగించారు. రేణిగుంట మండలం గాజులమండ్యంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్కును, సీఎన్‌జీ స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్‌ను, చిత్తూరులో ఏజీ అండ్ పి ప్రఽథమ్ థింక్ గ్యాస్ సీఎన్‌జీ మదర్ స్టేషన్‌ను ప్రారంభించి.. నెల్లూరులో ఎస్‌సీఎన్‌జీ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఏజీ అండ్ పీ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన జపాన్ ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమయ్యారు.