కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన కెనాల్‌లో సర్‌ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు 2025 రసవత్తరంగా జరిగాయి. కేరళ తరహాలో... రాష్ట్ర పర్యాటకశాఖ రెండు రోజులపాటు నిర్వహించే ఈ పోటీలు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరిగాయి. రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి 11 టీమ్‌లుగా 121 మంది పడవ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో జంగారెడ్డిగూడెం జెయింట్, పల్నాడు తండర్స్, ఎన్టీఆర్ ఈగల్స్, కోటిపల్లి సీతాష్, పల్నాడు పాంథర్స్, కృష్ణ లయన్స్ సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. సోమవారం ఫైనల్స్ జరుగుతాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారుతో పాటు రాజోలు ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఉంగుటురు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, రాజమహేంద్రవరం రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి జెండా ఊపి వీటిని ప్రారంభించారు.