ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ పాటు పడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారని కొల్లు చెప్పారు. పమిడిముక్కల మండలం తాడింకి జిల్లా పరిషత్ పాఠశాల శతాబ్ది వేడుకల్లో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, బోడె ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థులు, స్థానికులు పెద్దఎత్తున హాజరయ్యారు.తాడింకి పాఠశాల శతాబ్ది వేడుకలు పండగ వాతావరణంలో నిర్వహించడం, అందులో తానూ భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. పెద్దలు యలమంచిలి శివాజీ.. బ్రిటిష్ కాలంలోనే పది ఎకరాల భూమిని ఇవ్వడంతో పాఠశాల ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. యలమంచిలి శివాజీ త్యాగం వల్లే లక్షలాది మందికి ఈ పాఠశాల ద్వారా విద్యాబుద్దులు నేర్పించగలిగినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. వందేళ్ల పాఠశాల పండగకు పూర్వ విద్యార్థులందరూ రావడం శుభపరిణామం అని, వారందరినీ అభినందిస్తున్నట్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ స్కూళ్ల భూములు దోచేయడానికే జగన్ ప్రభుత్వం పాఠశాలల విలీన ప్రక్రియ తీసుకొచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తు్న్నట్లు మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు.